Andhra Pradesh: న్యూ ఇండియా స్కిల్ కేపిటల్‌గా ఏపీ: విజయసాయిరెడ్డి ట్వీట్
- ఏపీపై ఇన్వెస్ట్ ఇండియా ఆసక్తికర కథనం
- దానినే తన ట్వీట్‌కు జత చేసిన సాయిరెడ్డి
- జగన్ నాయకత్వంలో ఏపీ పురోగమిస్తోందని వ్యాఖ్య
భారత్‌కు నైపుణ్య రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా ఆయన ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ను పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్ ఇండియా విడుదల చేసిన గణాంకాలను ఆధారం చేసుకుని సాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు. న్యూ ఇండియా స్కిల్ కేపిటల్‌గా ఏపీ అవతరించనుందంటూ ఇన్వెస్ట్ ఇండియా చేసిన ట్వీట్‌ను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు.
ఏపీలో 400 మేనేజ్ మెంట్ కళాశాలలు, 368 ఇంజినీరింగ్ కళాశాలలు, 128 ఫార్మసీ కళాశాలలు. 18 రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావించిన ఇన్వెస్ట్ ఇండియా.. న్యూ ఇండియా స్కిల్ కేపిటల్ గా ఆంధ్రప్రదేశ్ ఎదగనుందని పేర్కొంది. ఇదే అంశాన్ని ప్రస్తావించిన సాయిరెడ్డి.. సీఎం జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని తెలిపారు.