YS Vivekananda Reddy: దస్తగిరి ఆ డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు: సీబీఐ వాంగ్మూలంలో వివేకా భార్య సౌభాగ్యమ్మ
- గతేడాది మూడు దఫాలుగా సౌభాగ్యమ్మ వాంగ్మూలం
- హత్యకేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్‌పై సంతకం తనదేనన్న సౌభాగ్యమ్మ
- తమ కంపెనీ ఆస్తులన్నీ వివేకా పేరిటే ఉన్నాయని వివరణ
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎదుట నిందితులు, అనుమానితులు, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కోవలోనే గతేడాది మూడు సార్లు వివేకా భార్య సౌభాగ్యమ్మ ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో ఆమె సీబీఐ ఎదుట పలు కీలక విషయాలు వెల్లడించారు.
తమ కంపెనీలన్నీ తన భర్త పేరిటే ఉన్నాయని చెప్పారు. హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై సంతకం చేసింది తానేనని అన్నారు. షేక్ దస్తగిరి తన భర్త వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడని, అప్పుడప్పుడు కొద్ది మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకునేవాడని చెప్పారు. అయితే, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవాడో, లేదో తనకు తెలియదని పేర్కొన్నారు.
16 డిసెంబరు 2018న తన సోదరి వివాహం అని చెబుతూ తన వద్ద రూ. 95 వేలు తీసుకున్నాడని, నోట్ రాయించి ఇచ్చాడని, సాక్షిగా షేక్ ఇనయతుల్లా సంతకం కూడా చేశాడని పేర్కొన్నారు. ఆ డబ్బును ఇప్పటి వరకు అతడు తిరిగి వెనక్కి ఇవ్వలేదని అన్నారు. అలాగే, తన భర్త వివేకా నుంచి దస్తగిరి రూ. 50 వేలు తీసుకున్న విషయం కానీ, ఆ సొమ్మును అతడు సునీల్ యాదవ్‌కు ఇచ్చిన విషయం కానీ తనకు తెలియదని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సౌభాగ్యమ్మ పేర్కొన్నారు.