Vladimir Putin: విదేశీ ఆంక్షలతో సతమతమవుతున్న రష్యా.. కీలక డిక్రీపై సంతకం చేసిన పుతిన్
- అమెరికా సహా ఇతర దేశాల ఆంక్షలు
- ఆర్థిక ఇబ్బందులను నివారించే చర్య
- 10 వేల డాలర్లకు మించి దేశం దాటడానికి వీల్లేకుండా ఆంక్షలు
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రష్యా సొంత దేశ ప్రజలపైనే కఠిన ఆంక్షలు విధించినట్టు ఉక్రెయిన్ మీడియా కథనాలు ప్రచురించింది. ఉక్రెయిన్ మీడియా అవుట్లెట్ ‘ది కీవ్ ఇండిపెండెంట్’ ప్రకారం.. ఆంక్షల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక డిక్రీపై సంతకం చేశారు.
10 వేల డాలర్లకు మించిన విదేశీ కరెన్సీతో రష్యన్లు దేశం దాటకుండా ఈ డిక్రీ అడ్డుకుంటుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా పరిగణిస్తూ అమెరికా, దాని మిత్రదేశాలు, ఈయూ, ఇతర దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ‘ది కీవ్ ఇండిపెండెంట్’ తన కథనంలో పేర్కొంది.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించారు. అయితే, రష్యాపై పోరాటంలో తమ ప్రమేయం ఏమీ ఉండబోదని తేల్చి చెప్పారు. మిత్రదేశాలతో కలిసి నాటో భూభాగాలను మాత్రం కాపాడుకుంటామని స్పష్టం చేశారు.