Sri Lanka: ఉక్రెయిన్ - రష్యా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీలంక!
- శ్రీలంకలో భారీగా పెరిగిన ఇంధన ధరలు
- ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు
- ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక
ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడానికి రష్యా చేస్తున్న ప్రయత్నం ప్రపంచ దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావాన్ని చూపుతోంది. రష్యా వార్ ప్రభావంతో శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. యుద్ధ ప్రభావం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలకు రెక్కలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న లంకకు... పెరుగుతున్న చమురు ధరలు పెను భారంగా పరిణమిస్తున్నాయి. శ్రీలంకలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 204కు, లీటర్ డీజిల్ ధర రూ. 139కి పెరిగింది. దీంతో లంక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ మధ్య కాలంలో శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై ఆ దేశం నిషేధం విధించింది. దీంతో, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆహార, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,657కి చేరింది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో లంకేయులు బిక్కుబిక్కు మంటున్నారు.