Ukraine: ఉక్రెయిన్ లో నేరగాళ్ల అరాచకాలు.. ప్రభుత్వం ఇచ్చిన ఆయుధాలతో దోపిడీలు, అత్యాచారాలు!
- వెలుగులోకి తెచ్చిన ఉక్రెయిన్ రచయిత లిరా
- రష్యాపై పోరాటానికి వీలుగా పౌరులకు ఆయుధాల సరఫరా
- దాంతో నేరగాళ్ల చేతికి సైనిక ఆయుధాలు
- వాటితో రెచ్చిపోతున్న ముఠాలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఆ దేశ పౌరులకే సమస్యలు తెచ్చిపెడుతోందా..? ఒకవైపు రష్యా సైనికుల దాడులతో భీతిల్లిపోతున్న స్థానిక పౌరులకు.. మరోవైపు ఆయుధాలు చేతబట్టిన నేరస్థుల బారి నుంచి కాపాడుకోవడం సవాలుగా మారిందా..? ఉక్రెయిన్ రచయిత గొంజలో లిరా చెబుతున్నది వింటే అవుననే అనిపిస్తోంది.
రష్యాపై పోరాటం చేసేందుకు ఆసక్తి చూపించే పౌరులు అందరికీ ఆయుధాలు ఇస్తామని అధ్యక్షుడు జెలెన్ స్కీ రష్యా యుద్ధం మొదలు పెట్టిన రెండో రోజు ప్రకటించారు. ‘‘జెలెన్ స్కీ యంత్రాంగం గడిచిన కొన్ని రోజులుగా సైనిక శ్రేణి ఆయుధాలను ఇస్తుండడంతో అవి చాలా మంది నేరస్థుల చేతికి వెళ్లాయి. దాంతో వారు దోపిడీలు, అత్యాచారాలు, అన్ని రకాల అరాచకాలకు పాల్పడుతున్నారు’’ అంటూ గత నెల 28న రచయిత లిరా ఒక వీడియోను విడుదల చేశారు.
కీవ్ లో గత రాత్రి వినిపించిన కాల్పులన్నీ కూడా రష్యన్లు చేసినవి కావు. రష్యా సైన్యం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవన్నీ నేరగాళ్ల గ్యాంగులు చేసినవే అయి ఉండొచ్చు’’ అంటూ వీడియోలో లిరా పేర్కొనడాన్ని గమనించొచ్చు.