Russia: సామాన్యుల ఇళ్లలోకి చొరబడి.. వాళ్ల దుస్తులు ధరించి.. జనాలపై రష్యా సైనికుల దొంగ దెబ్బ!
- ప్రజలను చంపుతూ ముందుకెళ్తున్నారన్న ఉక్రెయిన్ సైన్యం
- ప్రజల్లో తమకూ ఏజెంట్లున్నారని వెల్లడి
- వాళ్ల ద్వారా కుట్రదారులను ఏరేస్తున్నామని వివరణ
- ఉక్రెయిన్ నేతలను చంపేందుకు కుట్ర
- మూడు గ్రూపులుగా రష్యా కుట్రదారుల బృందాలు
కీవ్ ను స్వాధీనం చేసుకోవాలని రష్యా చేస్తున్న తీవ్ర ప్రయత్నాలకు ఉక్రెయిన్ సైన్యం ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే రష్యా సైనికులు దొంగ దెబ్బ కొడుతున్నట్టు ఉక్రెయిన్ సైనికులు చెబుతున్నారు. ఉక్రెయిన్ పౌరుల ఇళ్లలోకి చొరబడుతున్న కొందరు పారాట్రూపర్లు.. వారి బట్టలను ధరించి బయటకు వస్తున్నారని, సామాన్య జనంలా మారి ప్రజలను చంపేస్తున్నారని ఉక్రెయిన్ స్పియర్ యూనిట్ కమాండర్ విక్టర్ షెలోవాన్ చెప్పారు.
అయితే, ప్రజల్లోనూ తమకు ఏజెంట్లున్నారని, గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వారు వస్తే వాళ్లు తమకు చెప్పేస్తున్నారని వెల్లడించారు. వెంటనే తాము అక్కడకు వెళ్లి దొంగదెబ్బ కొట్టేవారి అంతు చూస్తున్నామని వివరించారు. అయితే, ఎంత మంది పారాట్రూపర్లు కీవ్ లోకి దిగారన్న దానిపై స్పష్టత లేకపోయినా.. వచ్చిన వారిని ఎదుర్కొనేందుకు ప్రజలు సహా సైన్యం సిద్ధంగా ఉన్నారు.
ఇర్పిన్ అనే గ్రామంలోని అటవీ ప్రాంతంలో సాధారణ జనంలా ఉన్న రష్యా సైనికుల కదలికలు పెరిగిపోయాయని అక్కడి స్థానికులు చెప్పారు. వాళ్లు స్థానికులను కాల్చి చంపుతున్నారని పేర్కొన్నారు. స్థానికుల మాటలు నిజమని మిలటరీ నిపుణులూ చెబుతున్నారు.
కీవ్ ను ఆక్రమించుకోకుండా స్థానికులూ పకడ్బందీ చర్యలను తీసుకుంటున్నారు. రష్యా యుద్ధ ట్యాంకులు, ఆర్మీ వాహనాలను పేల్చేసేందుకు గుంతలు తవ్వి అందులో మోలోటోవ్ కాక్ టెయిల్ (పెట్రోల్) బాంబులను పెడుతున్నారు.
కాగా, మేయర్లు సహా ఉక్రెయిన్ నేతలను చంపేందుకు రష్యా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇర్పిన్ లోని స్థానికుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కొందరు రష్యా సైనికులను పట్టుకున్నారు. వాళ్లను విచారించిన స్థానిక పోలీసులకు దిమ్మతిరిగిపోయే విషయాలు తెలిశాయి. మేయర్లు సహా స్థానిక నేతలను చంపేసేందుకు పంపినట్టు వారు చెప్పారు.
ఇలాంటి కుట్రదారులు మూడు రకాలున్నట్టు షెలోవాన్ చెప్పారు. రష్యా ప్రత్యేక దళాలు, జీఆర్ యూ (మిలటరీ ఇంటెలిజెన్స్)లను యుద్ధానికి ముందే ఉక్రెయిన్ లో దించారని, రష్యా సైన్యానికి సాయపడడమే వారి పని అని చెప్పారు. ఇక, మూడో గ్రూపు ఇంటెలిజెన్స్ ఏజెంట్స్.. ఉక్రెయిన్ నేతలను చంపేందుకు పంపించిన గ్రూప్ అని తెలిపారు.