Petrol: మళ్లీ పెట్రోల్, డీజిల్ మంట.. వచ్చే వారమే ధరల పెంపు!

Petrol diesel price hikes to restart from next week

  • అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమంటున్న క్రూడాయిల్
  • దేశీయంగా లీటర్ పై రూ.10 వరకు పెంచాల్సిన పరిస్థితి
  • ఎక్సైజ్ సుంకంలో కోత విధిస్తే కొంత ఉపశమనం
  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోతే మరింత భారం

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండుతుండడం భారతీయుల జేబులకు చిల్లు పెట్టనుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లకు చేరడం తెలిసిందే. భారత్ కొనుగోలు చేసే ముడి చమురు ధర మార్చి 1న బ్యారెల్ 102 డాలర్లకు చేరింది. 2014 ఆగస్ట్ తర్వాత ఇదే అత్యధిక ధర. 

గతేడాది నవంబర్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ పెంపు నిలిచిపోయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సర్కారు నుంచి వచ్చిన అనధికారిక సూచనల మేరకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు అయిన బీపీసీఎల్, ఐవోసీ, హెచ్ పీసీఎల్ నాటి రేటునే స్థిరంగా కొనసాగిస్తున్నాయి.

చివరి దశ పోలింగ్ ఈ నెల7తో ముగియనుంది. 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీంతో వచ్చే వారమే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్ల సవరణను చేపట్టవచ్చని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతానికి లీటర్ పెట్రోల్, డీజిల్ విక్రయంపై రూ.5.7 వరకు నష్టపోతున్నాయి. దీనికి రూ.2.5 మార్జిన్ అదనం. దీంతో ఒక లీటర్ పై రూ.9-10 వరకు ధరను పెంచక తప్పని పరిస్థితి ఉందన్నది జేపీ మోర్గాన్ విశ్లేషణ.

‘‘బ్యారెల్ చమురు ధర 100 వద్ద స్థిరంగా ఉంటే అప్పుడు ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్రం రూ. 1-3 తగ్గించొచ్చు. చమురు కంపెనీలు లీటర్ పై రూ. 5-8 మధ్య పెంపు చేపట్టవచ్చు’’ అని జేపీ మోర్గాన్ తెలిపింది. దీనితోపాటు వంట గ్యాస్ ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి. గృహ వినియోగ సిలిండర్ ధరలను కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత పెంచవచ్చు. 

దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి తెరపడక అలాగే కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలున్నాయి. అదే జరిగితే మరింత భారం మోయక తప్పదు. ఇప్పటికే లీటర్ పెట్రోల్ కు రూ.108 వెచ్చించాల్సి రావడం చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది.

  • Loading...

More Telugu News