Russia: రష్యా వాయుసేనకు ఏమైంది?.. వైమానిక దాడులను తగ్గించిన రష్యా!

Russia Using Less Air Force Over Ukraine War

  • యుద్ధ విమానాలు, పైలెట్ల రక్షణ కోసమేనన్న వాదనలు
  • సైనికులు, వైమానిక దళాల మధ్య సమన్వయలోపమంటున్న నిపుణులు
  • దాని వల్లే భారీగా రష్యా సైనికుల మృతి అన్న కథనాలు
  • విరివిగా వాయుసేన సేవల్ని వాడేస్తున్న ఉక్రెయిన్

అమెరికా, చైనా వంటి దేశాల తర్వాత అత్యంత శక్తిమంతమైన వాయుసేన ఉన్నది రష్యా దగ్గరే. ఉక్రెయిన్ పై యుద్ధం సందర్భంగా తొలుత యుద్ధ విమానాలను వాడిన రష్యా.. ఇప్పుడు వాటి వినియోగాన్ని తగ్గించేసింది. మొత్తంగా భూమ్మీది నుంచే యుద్ధం చేస్తోంది. ముప్పేట నుంచి ఉక్రెయిన్ పై దాడి చేస్తూ చుట్టుముట్టేస్తోంది. 

ఉక్రెయిన్ మాత్రం తన వాయుసేనల సేవల్ని విరివిగా వాడేసుకుంటోంది. ఎప్పటికప్పుడు గాల్లో చక్కర్లు కొడుతూ నిఘా పెడుతూనే ఉంది. కింద శత్రువుల యుద్ధ ట్యాంకులపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఇదే నిపుణులను తొలిచేస్తోంది. తొలుత ఉక్రెయిన్ వైమానిక దళాలు, వైమానిక స్థావరాలపై ఎయిర్ రైడ్స్ చేసిన రష్యా.. ఇప్పుడు ఎందుకు తగ్గించేసిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

తన యుద్ధవిమానాలు, పైలట్ల రక్షణ కోసమే వెనక్కి తగ్గిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ సేనలు గగనతల దాడులతో పాటు భూమ్మీద నుంచి కూడా దాడులు చేస్తూ రష్యా యుద్ధ విమానాలను పేల్చేస్తున్నాయి. యుద్ధంలో భాగంగా మొదట్లోనే వీలైనంత ఎక్కువ సైన్యాన్ని గ్రౌండ్ లోకి పంపాలని రష్యా భావించి ఉండొచ్చని ఫారిన్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన రష్యా మిలటరీ నిపుణుడు రాబ్ లీ చెప్పారు. 

ఇటు రష్యా వైమానిక దళాలు, సైనికుల మధ్య పరస్పర సమాచారం కొరవడడం వల్ల చాలా మంది రష్యా సైనికులు ఉక్రెయిన్ సైన్యం చేతిలో చనిపోయారని, దాని వల్ల కూడా రష్యా ఎక్కువగా వైమానిక సేవలను వినియోగించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. భూమిపైన సైనికులు, గగనతలంలో వైమానిక దళాల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఎయిర్ రైడ్స్ పై రష్యా వెనకడుగు వేస్తూ ఉండొచ్చని అమెరికా మాజీ కమాండర్ డేవిడ్ డెప్ట్యూలా చెబుతున్నారు. 

ఇటు రష్యాను ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కోవడంపైనా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ కు చెందిన ఓ యుద్ధ విమానం.. ఆరు రష్యా యుద్ధ విమానాలను నేల కూల్చింది. సోషల్ మీడియాలో ఆ యుద్ధ విమానాన్ని ‘ఘోస్ట్ ఆఫ్ కీవ్’గా పిలుస్తున్నారు. కాగా, రష్యా ప్రస్తుతం 75 యుద్ధ విమానాలనే వాడుతున్నట్టు అమెరికా అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News