Manish Dave: కీవ్ నగరంలో ఆపన్నులకు ఆహారం అందిస్తూ, ఆశ్రయం కల్పిస్తున్న భారతీయుడు

Indian restaurant owner gives food and shelter to people in Kyiv

  • యుద్ధంతో ఉక్రెయిన్ లో కల్లోలం
  • చెల్లాచెదురైన ప్రజాజీవితాలు 
  • బాంబు షెల్టర్లలో తలదాచుకుంటున్న ప్రజలు
  • ఆదుకుంటున్న 'సాథియా' రెస్టారెంట్ 

రష్యా దురాక్రమణ నేపథ్యంలో మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఉక్రెయిన్ లో పౌరుల దురవస్థలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. దాంతో ఉక్రెయిన్ పౌరులు లక్షలాదిగా పొరుగుదేశాలకు తరలిపోతున్నారు. రష్యన్ దళాలు నానాటికీ దేశంలోని భూభాగాలను ఆక్రమిస్తుండడంతో ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

ఇక, విద్యాభ్యాసం, ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఉక్రెయిన్ వచ్చిన విదేశీయుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వదేశం వెళ్లే మార్గం లేక, ఉక్రెయిన్ లో తిండి దొరక్క అలమటించిపోతున్నారు. బంకర్లలో ఆశ్రయం దొరికినా ఆహారం లభించని పరిస్థితి ఉంది. ఇలాంటి వేళ... ఓ భారతీయుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆపన్నహస్తం అందిస్తున్నాడు. అతడి పేరు మనీష్ దవే. గుజరాత్ కు చెందిన మనీష్ కీవ్ లోని ఓ జంక్షన్ లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఆ రెస్టారెంట్ పేరు సాథియా. 

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర షురూ చేయడంతో అనేకమంది భారతీయ విద్యార్థులకు సాథియా రెస్టారెంట్ లో  ఆశ్రయం కల్పిస్తున్నారు. ఉండడానికి చోటు మాత్రమే కాదు, వేడి వేడి ఆహారం అందిస్తూ కష్టకాలంలో మానవత్వం చాటుకుంటున్నారు. ఎవరికి ఆశ్రయం కావాలన్నా తమ రెస్టారెంట్ ద్వారాలు తెరిచే ఉంటాయని మనీష్ దవే సోషల్ మీడియాలో ప్రకటించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. 

ఇప్పటిదాకా 100 మందికి పైగా తాము ఆశ్రయం ఇచ్చామని, తమ శక్తిమేర సాయపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ గుజరాతీ వ్యాపారి వెల్లడించారు. కాగా, తమవద్ద ఉన్న సరుకులు మరో మూడ్నాలుగు రోజులు వస్తాయని, ఆ తర్వాత కర్ఫ్యూ ఎత్తివేస్తే దుకాణాలకు వెళ్లి మరిన్ని సరుకులు తెచ్చి తమ వద్ద ఆశ్రయం ఉన్న వారికి ఆహారం అందిస్తామని తెలిపారు. 

కాగా, సాథియా రెస్టారెంట్ పేరు, మనీష్ దవే పేరు అంతర్జాతీయంగా వినిపిస్తోంది. కల్లోల పరిస్థితుల్లో ప్రజలకు ఆశ్రయం కల్పిస్తూ మంచితనానికి మారుపేరులా నిలుస్తున్నారంటూ దవే గురించి అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా పేర్కొంటోంది. ముఖ్యంగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా సొంత డబ్బుతో వంద మందికి పైగా ఆశ్రయం, ఆహారం అందించడం మామూలు విషయం కాదు.

  • Loading...

More Telugu News