bhadrachalam: భద్రాద్రి రాములోరి కల్యాణం టికెట్ల విడుదల రేపే
- 11న మహా పట్టాభిషేకానికే టికెట్లు
- రెండేళ్లుగా ఏకాంతంగానే రాములోరి కల్యాణం
- కరోనా తగ్గడంతో ఈ ఏడాది భక్తుల మధ్యే ఉత్సవం
భద్రాచలం శ్రీసీతారామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి సంబంధించిన టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ టికెట్లను ఆన్లైన్లో గురువారం విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు నేడు ప్రకటించారు. ఆలయంలో ఏప్రిల్ 2 నుంచి 16 వరకు శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లుగా ఇదివరకే ఆలయ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న సీతారాముల కల్యాణోత్సవం, 11న మహా పట్టాభిషేకం, ఆ తర్వాత రథోత్సవం నిర్వహిస్తారు.
ఇక కల్యాణోత్సవానికి సంబంధించిన టికెట్లను గురువారం నాడు విడుదల చేయనున్నారు. ఆన్లైన్లో విడుదల కానున్న ఈ టికెట్లను కొనుగోలు చేసేందుకు ఆలయ వెబ్ సైట్ www.bhadrachalamonline.comను సంప్రదించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా రాములోరి కల్యాణం ఏకాంతంగానే జరిగింది. ప్రస్తుతం కరోనా విస్తృతి భారీగా తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల మధ్యే కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా ఆలయ ఈఓ ఇదివరకే ప్రకటించారు. రెండేళ్లుగా రాములోరి కల్యాణాన్ని వీక్షించని కారణంగా టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున యత్నించే అవకాశాలున్నాయి.