V Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర భాగస్వామి రఘును బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో అరెస్ట్ చేసిన పోలీసులు
- కుట్రను భగ్నం చేసిన సైబరాబాద్ పోలీసులు
- నలుగురు నిందితుల అరెస్ట్
- పేట్ బషీరాబాద్ లో ముగ్గురి అరెస్ట్
- ఢిల్లీలో ఒకరి అరెస్ట్
తెలంగాణ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను ఛేదించినట్టు సైబరాబాద్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి హత్య కుట్రలో భాగస్వామి రఘును ఢిల్లీలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసంలో అరెస్ట్ చేశారు. రఘుకు ఆశ్రయమిచ్చిన ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించి వదిలేశారు. ఈ హత్య కుట్ర వివరాలను సైబరాబాద్ పోలీసులు ఢిల్లీ పోలీసులతో పంచుకున్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ఓ సుపారీ గ్యాంగ్ రంగంలోకి దిగినట్టు గుర్తించిన సైబరాబాద్ పోలీసులు, వారిని పేట్ బషీరాబాద్ లో అరెస్ట్ చేశారు. వారిని విశ్వనాథ్, నాగరాజు, యాదయ్యలుగా గుర్తించారు. వీరు మహబూబ్ నగర్ కు చెందినవారుగా భావిస్తున్నారు. వారికి గతంలో నేర చరిత్ర ఉన్నట్టు గుర్తించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కోసం సదరు సుపారీ గ్యాంగ్... ఫరూక్ అనే వ్యక్తితో రూ.12 కోట్లకు ఒప్పందానికి ప్రయత్నించింది. అయితే ఫరూక్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర విషయం బట్టబయలైంది.
కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ను కూడా సుపారీ గ్యాంగ్ టార్గెట్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి ఎవరన్నది తెలియాల్సి ఉంది.