Ukraine: దేశ రక్షణ కోసం ఉక్రెయిన్ సైన్యంలో చేరుతున్న అథ్లెట్లు
- దేశ రక్షణకు కదులుతున్న క్రీడాకారులు
- సైన్యం దుస్తుల్లో కనిపించిన బయథ్లాన్ క్రీడాకారుడు దిమిత్రో
- యుద్ధ రంగంలో టెన్నిస్, బాక్సింగ్ దిగ్గజాలు కూడా..
రష్యా కబంధ హస్తాల నుంచి తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఉక్రెయిన్ అథ్లెట్లు కూడా సైన్యంలో చేరుతూ దేశభక్తిని చాటుకుంటున్నారు. ఇప్పటికే పలువురు క్రీడాకారులు సైన్యంలో చేరారు. చైనా రాజధాని బీజింగ్‌లో ఇటీవల జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న దిమిత్రో పిద్రుచ్నీ మిలటరీ దుస్తులు ధరించి రంగంలోకి దిగాడు. దిమిత్రో మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాడు. బయథ్లాన్ ( స్కీయింగ్, షూటింగ్) ప్రపంచ చాంపియన్ కూడా.
వింటర్ ఒలింపిక్స్ ముగించుకుని గత వారమే స్వదేశం చేరుకున్నాడు. ఇప్పుడు సైనిక దుస్తులు ధరించి దేశ రక్షణకు పాటుపడుతున్నాడు. సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన దిమిత్రో.. తన స్వస్థలమైన టెర్నోపిల్‌లో ఉక్రెయిన్ జాతీయ రక్షకుడిగా విధులు నిర్వర్తిస్తున్నట్టు పేర్కొన్నాడు. అలాగే, టెన్నిస్ క్రీడాకారుడు సెర్హీ స్టాఖోవ్స్కీ, బాక్సింగ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ అయిన వెసిల్ లొమచెంకో, హెవీ వెయిట్ ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండర్ యుసిక్‌లు కూడా ఆయుధాలు చేపట్టి దేశ రక్షణలో పాల్లొంటూ స్పూర్తిగా నిలుస్తున్నారు.