Bay Of Bengal: నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. రేపటి నుంచి మూడు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు!
- ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
- రేపు తమిళనాడు తీరం దిశగా వాయుగుండం
- ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. నిన్న ఇది తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని హిందూ మహాసముద్ర పరిసరాల్లో కొనసాగుతోంది. నేడు మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని అధికారులు తెలిపారు.
రేపు ఇది తమిళనాడు తీరం దిశగా దూసుకొస్తుందని, ఫలితంగా రేపటి నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలలో వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. నిన్న రాయలసీమ, కోస్తాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 37, అనంతపురంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.