Russia: ఉక్రెయిన్‌లో దయనీయంగా మారిన రష్యా సైనికుల పరిస్థితి.. ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనం
- రష్యన్ సైన్యంలో అధికశాతం యువతే
- పూర్తిస్థాయి యుద్ధంలో లేని శిక్షణ
- తిండిలేక, నీరు దొరక్క అల్లాడిపోతున్న వైనం
- సొంత వాహనాలనే ధ్వంసం చేసున్నట్టు కథనం
ఉక్రెయిన్‌లోకి దూసుకొచ్చి యుద్ధం చేస్తున్న రష్యా సైనికుల పరిస్థితి దారుణంగా ఉందంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. వారి పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోందని పేర్కొంది. తినడానికి తిండిలేక, తాగడానికి నీరు లేక అల్లాడిపోతున్నారని తెలిపింది.
యుద్ధానికి సంబంధించి ముందస్తుగా ఎలాంటి ప్రణాళిక లేకపోవడమే ఇందుకు కారణమని వివరించింది. రష్యా సైన్యంలో ఎక్కువమంది యువకులే ఉన్నారని, పూర్తిస్థాయి యుద్ధంలో ఎలా పాల్గొనాలో వారికి సరైన శిక్షణ ఇవ్వలేదని రాసుకొచ్చింది.
వారి దయనీయ పరిస్థితికి అదే కారణమని పేర్కొంది. ఉక్రెయిన్‌లో కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చిపారేయాలని సైన్యాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ వారికి ఆ పనిచేయడానికి మనస్కరించడం లేదని తెలిపింది. శత్రుదేశ పౌరులను కాల్చడం, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని ఇష్టపడని రష్యన్ సైనికులు సొంతం వాహనాలనే ధ్వంసం చేసుకుంటున్నారంటూ ఆ కథనంలో వివరించింది. ఈ విషయాలన్నీ రష్యన్ సైనికులే వెల్లడించారని తెలిపింది.