Petrol: లీటర్ పెట్రోల్ ధర రూ. 125కి చేరే అవకాశం?

Liter Petrol to reach Rs 125

  • 111 డాలర్లకు చేరుకున్న బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మన దేశంలో స్థిరంగా ఉన్న ధరలు
  • వచ్చే వారంలో పెట్రోలియం ధరలు భారీగా పెరిగే అవకాశం

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. నిన్న బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 111 డాలర్లకు చేరుకుంది. ఇది 8 ఏళ్ల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. గత రెండు రోజుల్లోనే క్రూడ్ ధర 15 శాతం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా ఇండియాలో మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలే దీనికి కారణమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 

ఇక ఈ నెల 7న ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెట్రోలియం కంపెనీలు పెంచుతాయని అంటున్నారు. ఇప్పుడు ధరలను పెంచితే ప్రభుత్వంపై ఓటర్లలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, అందువల్ల ధరల పెంపు జోలికి వెళ్లలేదని చెపుతున్నారు. 

వాస్తవానికి బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్లకు చేరేసరికే పెట్రోలియం కంపెనీలకు లీటర్ పెట్రోల్ పై రూ. 9 నష్టం వస్తోందని చెపుతున్నారు. ఇప్పుడు బ్యారెల్ ధర 111 డాలర్లను మించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలను బాగానే పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అన్ని సుంకాలతో కలిపి లీటర్ పెట్రోల్ ధర రూ. 120 - 125కి చేరే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News