Donald Trump: 'తదుపరి దండయాత్ర తైవాన్ మీదే' అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్య
- వాషింగ్టన్ మూర్ఖంగా నడుస్తోందని విమర్శ
- జిన్ పింగ్ తెలివైన వాడన్న ట్రంప్
- ఆఫ్ఘనిస్థాన్ విషయంలో అమెరికా అనుభవాలు చూడాలి
- ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచన
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరు. తదుపరి దండయాత్ర తైవాన్ పైనే అంటూ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న తరుణంలో ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.
‘‘తైవాన్ పై తదుపరి దాడి జరగొచ్చు. అధ్యక్షుడు షి (చైనా అధ్యక్షుడు) ఉత్సాహంగా చూస్తున్నారు’’ అని ఫాక్స్ బిజినెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పై మరోసారి విమర్శలతో ట్రంప్ విరుచుకుపడ్డారు. ‘‘తైవాన్ పై దాడి జరుగుతుందన్నది నా అంచనా. ఎందుకంటే వాషింగ్టన్ ఎంతో మూర్ఖంగా నడుస్తోంది. మన నాయకులను అసమర్థులుగా చూస్తున్నారు. వారు చేయాలనుకున్నది చేస్తున్నారు. ఇది వారి సమయం’’ అని ట్రంప్ అన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ విషయంలో అమెరికా ఎదుర్కొన్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పరోక్షంగా షి జిన్ పింగ్ కు ట్రంప్ సూచించారు. ‘‘జిన్ పింగ్ ఎంతో తెలివైన వ్యక్తి. ఆఫ్ఘనిస్థాన్ ను మేము ఎలా వీడి వచ్చిందీ ఆయన చూశారు. అక్కడ చిక్కుకుపోయిన అమెరికా పౌరులు ఇంకా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిని ఆయన చూశారు. ఇక ఏం చేయాలన్నది ఆయన ముందున్న అంశం’’ అంటూ ట్రంప్ హితబోధ చేశారు.