Narendra Modi: ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్రతరం కావడంతో.. నేడు మోదీ, బైడెన్, మోరిసన్, ఫుమియో భేటీ
- ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలు
- వర్చువల్ భేటీలో ఆయా అంశాలపై చర్చించనున్న నేతలు
- ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ తటస్థ వైఖరి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమైన విషయం తెలిసిందే. మరోవైపు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు క్వాడ్ దేశాధినేతలు సమావేశం కానున్నారు. వర్చువల్ విధానంలో జరగనున్న ఈ సమావేశంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా పాల్గొని, తమ అభిప్రాయాలు తెలుపుతారు.
ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై వీరు ప్రధానంగా చర్చిస్తారని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా దాడులు జరుపుతోన్న నేపథ్యంలో ఈ విషయంపై భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది.
అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ మాత్రం రష్యా తీరును వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కూడా నేడు చర్చ జరుగుతుండడం గమనార్హం. రష్యా చేస్తున్నది ఆక్రమణ కాదంటూ ఆ దేశానికి చైనా పరోక్షంగా మద్దతు తెలుపుతోన్న విషయం తెలిసిందే.