Russia: టీ, బ్రెడ్డు ఇచ్చి రష్యా సైన్యానికి సపర్యలు చేస్తున్న ఉక్రెయిన్ ప్రజలు.. వాళ్లు పిల్లలంటూ జెలెన్ స్కీ కామెంట్
- ఫోన్లిచ్చి తల్లిదండ్రులతో మాట్లాడిస్తున్న వైనం
- రష్యా సైనికులేం సూపర్ పవర్, యోధులు కాదన్న జెలెన్ స్కీ
- ఏమీ తెలియని పిల్లలను రష్యా వాడుకుంటోందని ఫైర్
బందీలుగా చిక్కిన రష్యా సైనికులకు ఉక్రెయిన్ ప్రజలు సపర్యలు చేస్తున్నారు. తిండి, నీళ్లు లేక నీరసించిపోయిన వారికి చాయ్, బ్రెడ్ ఇచ్చి కడుపు నింపుతున్నారు. తమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వీలుగా ఫోన్లు ఇస్తున్నారు. అంతటి ఆప్యాయతలు పొందడంతో రష్యా సైనికులు ఏడ్చేసి తల్లడిల్లిపోతున్నారు. అమ్మానాన్నలతో మాట్లాడి తమ మనసులోని బాధలను దించేసుకుంటున్నారు.
కాగా, రష్యా సైనికుల పరిస్థితిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. వారి సైన్యంలో నైతిక స్థైర్యం దెబ్బతింటోందని ఆయన అన్నారు. నిన్న రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. తమ బలగాలు 9 వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టాయని వివరించారు. తమ సైనికులు హీరోల్లాగా రష్యా దాడిని అడ్డుకుంటున్నారని కొనియాడారు. ఒక్క వారంలోనే శత్రువు కుట్రలు, కుతంత్రాలను విచ్ఛిన్నం చేశామన్నారు. ఏళ్లతరబడి తమపై ద్వేషంతో రాసుకున్న ధ్వంసచరితను నాశనం చేశామన్నారు.
ప్రతి రోజూ రష్యా సైనికులను తమ సైన్యం, సరిహద్దు దళాలు, సాధారణ రైతులు పట్టుకుంటున్నారని గుర్తు చేశారు. ‘‘మేమెందుకు ఇక్కడ ఉన్నామో తెలియదంటూ పట్టుబడిన రష్యా సైనికులు వాపోతున్నారు. శత్రు సేనల నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. వాళ్లేం సూపర్ పవర్ కాదు. యుద్ధ యోధులు కాదు. వీళ్లంతా చిన్న పిల్లలు. రష్యా వాళ్లను వాడుకుంటోంది. వాళ్లకు మా వాళ్లు సాయం చేస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఇక్కడకు వచ్చిన ఆ పిల్లలకు తిండి, నీళ్లు, ప్రశాంతత వంటివేవీ లేవన్నారు.