Sharmila: ఉన్న సమస్య పరిష్కారమేమో కానీ... లేని సమస్యలను సృష్టించారు: కేసీఆర్పై షర్మిల విమర్శలు
- 'ధరణి' భూ సమస్యల పరిష్కారానికి మంత్రదండం అన్నారు
- భూమి ఉన్నోళ్లకు లేనట్టు, లేనోళ్లకు ఉన్నట్టు చూపెడుతున్నారు
- భూమి కోసం అధికారుల చుట్టూ తిరగలేకపోతున్నారు
- లంచాలు ఇచ్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ''ధరణి భూ సమస్యల పరిష్కారానికి మంత్రదండం అని చెప్పుకున్న కేసీఆర్ గారు, ఉన్న సమస్య పరిష్కారమేమో కానీ లేని సమస్యలను సృష్టించారు. భూమి ఉన్నోళ్లకు లేనట్టు, లేనోళ్లకు ఉన్నట్టు చూపెడుతూ యజమానులకు లేని పంచాయితీ మోపు చేశారు.
భూమి కోసం అధికారుల చుట్టూ తిరగలేక లంచాలు ఇచ్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుని కొందరు చనిపోతే, కాస్తు కాలాన్ని ఎత్తేస్తే పాత పేర్ల మీద రికార్డులు చూపటంతో ఆ భూముల కోసం హత్యలు చేసుకుంటున్నారు. లోపాలు ఉన్నాయని మీరే ఒప్పుకొన్నా వాటిని పరిష్కరిస్తే మీ పనికిమాలిన పని ఈ ధరణి అని తేలిపోతుందని భయపడుతున్నారా? మీ తప్పుని సరిదిద్దుకొని ధరణి పంచాయితీలు తెంపండి'' అని షర్మిల విమర్శలు గుప్పించారు.