Russia: రష్యా అధ్యక్షుడికి వంటవాడితడు.. పుతిన్ ప్రైవేట్ సైన్యాన్ని శాసించేంత పవర్ ఫుల్
- వాగ్నర్ పీఎంని నడిపిస్తున్న ప్రిగోజిన్
- 1990ల్లో ఇద్దరి మధ్యా స్నేహం
- దోపిడీ కేసుల్లో 9 ఏళ్ల జైలు శిక్ష
- కిరాయి మూకలతో ప్రైవేట్ మిలటరీ కంపెనీ
- జెలెన్ స్కీని చంపేందుకు పురమాయింపు
అతడి పేరు యెవ్జెనీ ప్రిగోజిన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వంటవాడు. అలాగని తక్కువ అంచనా వేయొద్దు. పుతిన్ ప్రైవేట్ సైన్యాన్ని నియంత్రించేంత పవర్ ఫుల్ అతడు. వాగ్నర్ ప్రైవేట్ మిలటరీ కంపెనీ (పీఎంసీ) అతడి కనుసన్నల్లోనే ఉంది. కిరాయి సైనికులే ఉండే ఆ గ్రూపును అతడు శాసిస్తున్నాడు. వివిధ దేశాల్లో పుతిన్ అనుకూల లక్ష్యాలను అందుకోవడానికి రహస్యంగా పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకూ ఈ కిరాయి మూకలనే పుతిన్ వంటవాడు (షెఫ్) పురమాయించినట్టు తెలుస్తోంది.
పుతిన్ కు సన్నిహితుడిగా, శక్తిమంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకన్నా.. వారిద్దరి మధ్య పరిచయం, స్నేహం వెనుక నాటకీయ పరిణామాలున్నాయి. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ 9 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. బయటకు వచ్చిన పిమ్మట హాట్ డాగ్స్ అమ్ముకుంటూ జీవనం సాగించాడు. సోవియట్ యూనియన్ మొత్తం పతనమయ్యాక పీటర్స్ బర్గ్ లో రెస్టారెంట్ పెట్టాడు.
1990ల్లోనే పుతిన్ అక్కడి మేయర్ ఆఫీసులో పనిచేసేవాడు. అప్పుడే ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వ్యాట్కా నదిపై ప్రిగోజిన్ ‘న్యూ ఐలండ్’ అనే తేలియాడే రెస్టారెంట్ ను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత పుతిన్ రష్యా అధ్యక్షుడు కావడం, ప్రిగోజిన్ వ్యాపార విస్తరణ మొదలవడం చకచకా జరిగిపోయాయి. రష్యా పాఠశాలలు, సైన్యానికి వంటల కోసం అతడికే ఫుడ్ కాంట్రాక్టులు దక్కాయి. విదేశీ ప్రముఖులు వస్తే అతడే అందరికీ వంట చేస్తుంటాడు.
వాగ్నర్ పీఎంసీ గ్రూపును ప్రిగోజిన్ నిర్వహిస్తున్నట్టు 2014లోనే తొలిసారి బయటకు తెలిసింది. క్రిమియా ఆక్రమణలోనూ ‘లిటిల్ గ్రీన్ మ్యాన్’ పేరిట ఆపరేషన్ చేసినట్టు చెబతారు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు అనుకూలంగా ప్రచారం చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి.
వాస్తవానికి వాగ్నర్ పీఎంసీని అతడు నిర్వహిస్తున్నా.. దానిపై ఏ కంపెనీ కూడా రిజిస్టర్ కాలేదు. రష్యా సైన్యానికి చెందిన మాజీ లెఫ్టినెంట్ కర్నల్ దిమిత్రీ ఉత్కిన్ దానిని ప్రారంభించాడు. జర్మనీ నియంతకు ఇష్టమైన ఒపెరా కంపోజర్ వాగ్నర్ పేరే ప్రైవేట్ సైన్యానికి పెట్టారని అంటూ ఉంటారు. ఈ వాగ్నర్ సైనిక టీంలో ఎక్కువగా రిటైర్డ్ ఆర్మీ అధికారులే ఉంటారని చెబుతారు. వారు చనిపోతే 50 వేల డాలర్ల చొప్పున పరిహారం ఇస్తారట. 2017 బ్లూమ్ బర్గ్ లెక్కల ప్రకారం 6 వేల మంది దాకా సైనికులు ఇందులో ఉన్నారు.
ప్రిగోజిన్ ఒక్క రష్యాతోనే ఆగిపోలేదు. లిబియా సివిల్ వార్, సిరియా, మొజాంబిక్, మాలి, సూడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, వెనెజువెలా వంటి దేశాలకూ వాగ్నర్ ప్రైవేట్ సైన్యాన్ని విస్తరించాడు. సిరియా బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఈ సైనికులే కృషి చేశారని చెబుతారు. 2018లో అమెరికా దళాలతో జరిగిన పోరులో 300 మంది వాగ్నర్ గ్రూప్ సభ్యులు చనిపోయినట్టు ప్రచారంలో ఉంది.
వాస్తవానికి ప్రైవేటు సైన్యాలు రష్యా చట్టాలకు వ్యతిరేకం. ఎప్పుడంటే అప్పుడు ఈ ప్రైవేటు సైన్యాలను అణచేసే అధికారం సైన్యానికి ఉంటుంది. అయితే, ఏదైనా సందర్భంలో రష్యా పేరు బయటకొస్తే దానిని తుడిచేసేందుకు ముందుజాగ్రత్తగానే చట్టం చేసినట్టు చెబుతారు.