Summer: హమ్మయ్య.. ఈ ఏడాది వేసవి కూల్!
- తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే
- లానినా ప్రభావంతో వేడి తీవ్రత అంతగా ఉండకపోవచ్చు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాలు
వేసవి వస్తుందంటేనే తెలియని ఆందోళన. ఎండల తీవ్రతకు పగటి సమయంలో బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ, ఈ ఏడాది వేసవి సీజన్ కు సంబంధించి చల్లటి వార్తను భారత వాతావరణ శాఖ చెప్పింది. మార్చి నుంచి మే వరకు ఉండే వేసవి సీజన్ లో తెలంగాణలో ఎండల ప్రభావం అంతగా ఉండదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్ కు సంబంధించి గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువే ఉంటాయని అంచనాలు ప్రకటించింది.
వాతావరణ శాఖ అంచనాలు నిజమే అయితే వరుసగా రెండో ఏడాది హైదరాబాద్ నగర ప్రజలు ఊపిరి పీల్చుకోనున్నారు. గతేడాది వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ లోపే ఉండడం గమనార్హం. ‘‘వేసవి సీజన్ లో అధిక శాతం తెలంగాణ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువే ఉండొచ్చు’’ అంటూ భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సీజనల్ బులిటెన్ తెలిపింది. పసిఫిక్ భూమధ్యరేఖ ప్రాంతంపై లానినా ప్రభావంతో ఉష్ణోగ్రతలు అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. దీంతో ఎక్కువ రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ పరిధిలోనే నమోదు కానున్నాయి.