V Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో సంచలన విషయాలు... మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసిన నిందితుడు రాఘవేంద్రరాజు!
- మంత్రి శ్రీనివాస్ హత్యకు కుట్ర
- భగ్నం చేసిన సైబరాబాద్ పోలీసులు
- ఢిల్లీలో ముగ్గురు నిందితుల అరెస్ట్
- మంత్రి వల్ల తనకు ప్రాణభయం ఉందన్న రాఘవేంద్రరాజు
- మంత్రి వేధింపులు భరించలేకపోయానని వెల్లడి
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న యాదయ్య, విశ్వనాథ్, నాగరాజులను పేట్ బషీరాబాద్ లో అరెస్ట్ చేయగా, ఈ కేసులో సూత్రధారులుగా భావిస్తున్న ముగ్గురిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలోని సర్వెంట్ క్వార్టర్స్ లో రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూదన్ రాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరు అమరేందర్ రాజు అనే వ్యక్తితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు రూ.15 కోట్లతో సుపారీ ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడైంది.
కాగా, ఈ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. నిందితుల్లో ఒకరైన రాఘవేంద్రరాజు తన స్టేట్ మెంట్లో మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు కథనాలు వస్తున్నాయి.. వాటి ప్రకారం... శ్రీనివాస్ గౌడ్ 2017 నుంచి తనను చంపించేందుకు ప్రయత్నం చేశారని రాఘవేంద్రరాజు వెల్లడించాడు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని ఆరోపించాడు. తనపై శ్రీనివాస్ గౌడ్ 30 కేసులు పెట్టించాడని, అందులో 10 కేసులు ఒకే రోజు పెట్టించారని వివరించాడు. వాటిలో ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా ఉన్నాయని తెలిపాడు.
తన బార్ ను మూసేయించి ఇబ్బందులకు గురిచేశాడని, రూ.6 కోట్ల మేర ఆర్థికంగా నష్టపరిచాడని పేర్కొన్నాడు. వేధింపులు తట్టుకోలేకనే శ్రీనివాస్ గౌడ్ ను చంపాలనుకున్నానని తెలిపాడు. తనకు శ్రీనివాస్ గౌడ్ నుంచి ప్రాణభయం ఉందని రాఘవేంద్రరాజు పేర్కొన్నాడు.