Amaravati: మూడు ముక్కలాటకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు: నారా లోకేశ్
- అమరావతికి చెందిన సకల జనుల విజయమని వెల్లడి
- శాంతియుత ఉద్యమంతోనే రైతుల విజయం
- ఇప్పటికైనా అభివృద్దికి కృషి చేస్తే వైకాపాకు చరిత్రలో పేజీ
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అధికార వైసీపీ నుంచి అసంతృప్త రాగాలు వినిపిస్తోంటే.. ఆది నుంచి రాజదాని రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తూ వస్తోన్న టీడీపీ నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించగా.. తాజాగా ఈ విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. హైకోర్టు తీర్పు జగన్ సర్కారు ఆడుతున్న మూడు ముక్కలాటకు చెంపపెట్టేనని ఆయన వ్యాఖ్యానించారు.
హైకోర్టు తీర్పు అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతుల విజయమని లోకేశ్ అన్నారు. అమరావతి ప్రాంత సకల జనులూ సాగించిన నిస్వార్ధ ఉద్యమ ఫలితమే హైకోర్టు తీర్పు అని కూడా ఆయన ఓ కీలక వ్యాఖ్య చేశారు. సర్కారు అరెస్ట్లు, నిర్బంధాలు, దాడులను ఎదుర్కొని నిలిచిన రైతుల విజయమిదని ఆయన పేర్కొన్నారు. శాంతియుత ఉద్యమంతోనూ రైతులు, మహిళలు విజయం సాధించారని లోకేశ్ తెలిపారు. ఇప్పటికైనా అభివృద్దికి వైకాపా కృషి చేస్తే చరిత్రలో వారికో పేజీ ఉంటుందని నారా లోకేశ్ సూచించారు.