Andhra Pradesh: ఏపీ ప్రస్తుత దుస్థితికి ఆ రెండు పార్టీలే కారణం: సోము వీర్రాజు
- వైసీపీ, టీడీపీల కారణంగానే ప్రస్తుత పరిస్థితి అని ఆరోపణ
- ఏపీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడి
- గ్రామాల నిధుల మళ్లింపు దురదృష్టకరమని వ్యాఖ్య
- పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్రం నుంచి సహకారం లేదని ఆరోపణ
ఏపీకి ఇప్పటికీ ఇదే రాజధాని అంటూ లేని దుస్థితికి రెండు ప్రాంతీయ పార్టీలే కారణమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని అధికార పార్టీ వైసీపీ, విపక్ష పార్టీ టీడీపీలే ఆ రెండు పార్టీలని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం విజయవాడలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశానికి హాజరైన వీర్రాజు..అమరావతిపై హైకోర్టు తన తీర్పును వెలువరించిన నేపథ్యంలో రాజధాని అంశంపై ఆయన స్పందించారు.
కేంద్రంలోని తమ పార్టీ ప్రభుత్వం ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిందని వీర్రాజు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలకు వైసీపీ,టీడీపీలే కారణమని ఆయన ఆరోపించారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ సర్కారు ఇతరత్రా పనులకు మళ్లించడాన్ని తాను వ్యతిరేకమని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లేదని వీర్రాజు ధ్వజమెత్తారు.