Amaravati: అమరావతి రైతులకు జగన్ క్షమాపణ చెప్పాలి: జనసేన
- అంతిమంగా న్యాయం, ధర్మాలదే విజయం
- హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపింది
- వైసీపీ పాలనతో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం కోల్పోయింది
- జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు గురువారం వెలువరించిన తీర్పుపై దాదాపుగా అన్నిరాజకీయ పార్టీలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా ఈ తీర్పుపై స్పందించింది. ఈ మేరకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం జగన్ అమరావతి రైతులతో పాటు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతిమంగా న్యాయం, ధర్మాలే విజయం సాధిస్తాయనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ అని కూడా ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే పునాదులు వేసి కొంత మేర అభివృద్ధి జరిగిన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను విస్మరించిన జగన్ సర్కారు.. హైకోర్టు తీర్పుతో అయినా తన వైఖరి మార్చుకోవాలని నాదెండ్ల కోరారు. హైకోర్టు తీర్పు అమరావతి రైతుల్లోనే కాకుండా రాష్ట్ర ప్రజల్లోనూ ధైర్యాన్ని నింపిందని ఆయన పేర్కొన్నారు.
జగన్ సర్కారు రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే ఇప్పటికే వివిధ పారిశ్రామిక సంస్థలు చేసుకున్న ఒప్పందాల ప్రకారం రాష్ట్రానికి రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవన్నారు. జగన్ సర్కారు అభివృద్ధి నిరోధక పాలన కారణంగా ఆ పెట్టుబడులన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని ఆయన పేర్కొన్నారు. 807 రోజుల పాటు సాగిన అమరావతి రైతుల ఉద్యమం, ఆ ఉద్యమాలను అణచివేసేందుకు జగన్ సర్కారు చేసిన కుట్రలను ఈ సందర్భంగా మనోహర్ ప్రస్తావించారు.