Chandrababu: అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పుపై చంద్రబాబు స్పందన
- మంగళగిరిలో సర్పంచ్ ల అవగాహన సదస్సులో చంద్రబాబు ప్రసంగం
- ఈ విజయం రాష్ట్ర ప్రజలందరిదీ అని వెల్లడి
- రైతులకు, రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపిన బాబు
ఏపీ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మంగళగిరిలో సర్పంచ్ ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిలో ఒక కులం, ఒక మతం, ఒక వర్గం అని కాకుండా అందరూ ఉన్నారని తెలిపారు. ముస్లింలు ఉన్నారని, ఎస్సీ ఎస్టీలు ఉన్నారని వివరించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చారని వెల్లడించారు.
"పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చేది భూమి. భూమి అంటే మనవాళ్లకు ఎంతో సెంటిమెంట్. అలాంటిది 33 వేల ఎకరాల భూములు ఎలాంటి వివాదాలు లేకుండా ఇచ్చారు. రాజధాని శంకుస్థాపనకు సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చారు. సింగపూర్, జపాన్ వంటి దేశాల నుంచి మంత్రులు వచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి సీఎంలు, గవర్నర్లు వచ్చారు. అందరి ఆశీస్సులతో భూమి పూజ చేస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలాటకు తెరలేపింది.
గత రెండేళ్లుగా వరదలు వస్తున్నాయి. అమరావతిలో ఎక్కడైనా ఒక్క ఎకరం ముంపుకు గురైందా? కానీ ఇది వరద ముంపుకు గురయ్యే భూమి అని లేనిపోని వ్యాఖ్యలు చేశారు. ఇది శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. కృష్ణా నది పారే పట్టిసీమ పక్కనే ఉన్న ప్రాంతాన్ని ఈ విధంగా అనడం బాధాకరం. ఇక్కడి భూమి పునాదులు వేసేందుకు అనువుగా లేదన్నారు. దాంతో, మద్రాస్ ఐఐటీ నిపుణులు చెన్నై కంటే, హైదరాబాద్ కంటే పునాదులకు అమరావతి భూమే గట్టిదని వెల్లడించారు. ఇలాంటివి చాలా జరిగాయి.
ఇలాంటి దుర్మార్గులు ఎవరో ఒకరు వస్తారనే ఆనాడు ఎంతో ఆలోచించి సీఆర్డీయే చట్టం తీసుకువచ్చాం. భూములు ఇచ్చిన రైతులకు పక్కాగా హక్కులు కల్పించాం. రాజధాని కోసం 807 రోజులుగా రైతాంగం దీక్ష చేస్తోంది. రైతులను కొట్టారు, మహిళల జుట్టు పట్టుకుని లాగారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారు పోరాడి విజయం సాధించారు. ఈ ప్రభుత్వం మూడేళ్లు ఇష్టం వచ్చినట్టు పరిపాలించింది. ఇక రెండేళ్లే మిగిలుంది. చేయడానికి కూడా ఏమీ లేదు. కానీ ఇప్పటివరకు చేసిన దానికి చరిత్రహీనులుగా చిరస్థాయిగా మిగిలిపోతారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు ఎవరిచ్చారు మీకు? తప్పుడు కేసులు పెడితే భయపడాలా? ప్రజలందరూ తిరగబడితే ఈ పోలీసులు ఏమవుతారు? ఇవాళ అమరావతి రైతులు సాధించిన విజయం ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలందరిదీ. ఈ స్ఫూర్తిదాయక విజయం పట్ల అమరావతి రైతులను, రాష్ట్ర ప్రజలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.