Amaravati: హైకోర్టు తీర్పుపై అప్పీల్ అవ‌స‌రం ఏముంది?: మంత్రి బొత్స

botsa satyanarayana comments on ap high court judgement

  • వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం
  • రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనని కేంద్రం చెప్పింది
  • రైతుల‌కు జ‌గ‌న్ ఎందుకు క్ష‌మాప‌ణ చెప్పాలి?
  • రాజధానిపై మా విధానం మాకు ఉందన్న బొత్స 

ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష ముగిశాక‌.. రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ స‌మీక్ష‌కు ముందు హైకోర్టు తీర్పు కాపీ అందిన త‌ర్వాత దానిని పూర్తిగా ప‌రిశీలించిన త‌ర్వాతే హైకోర్టు తీర్పును స‌వాల్ చేయాలా? వ‌ద్దా? అన్న విష‌యంపై ఓ నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పిన బొత్స‌... స‌మీక్ష ముగిసిన త‌ర్వాత హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. దీంతో హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్ల‌కూడ‌ద‌ని జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యించిన‌ట్లుగా స‌మాచారం. 

ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స వివరంగా మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లాలా..? లేదా..? అన్న‌ది ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని చ‌ప్పారు. అయినా అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని కూడా ఆయ‌న‌ ప్రశ్నించారు. అయితే తాము మాత్రం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ది అంశం సమయం, ఖర్చు, నిధులతో ముడిపడి వుందని, అభివృద్ధి విషయంలో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామ‌న్నారు. ప్రస్తుతం సీఆర్డీఏ చట్టం అమల్లో ఉందన్న బొత్స.. దీనిని, డీవియేషన్ చేసి ఎలా ముందుకు వెళ్తామ‌ని.. రాజధానిపై మా విధానం మాకు ఉందని స్పష్టం చేశారు.

అభివృద్ధి అనేది వ్యక్తుల కోసం కాదు.. వ్యవస్థ కోసమ‌ని బొత్స వ్యాఖ్యానించారు. రాజధానిలో డెవలప్‌మెంట్ చేస్తున్నామ‌ని.. ఎక్కడా డీవియేట్ కావడం లేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానమ‌ని, దానికి కట్టుబడి ఉన్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. రైతులకు చేయాల్సినవన్నీ చేస్తున్నామ‌ని, రైతులకు సీఎం ఎందుకు క్షమాపణ చెప్పాలని నిలదీశారు. 

ఇక రాజధాని భూములను ఇతర అవసరాల కోసం ఎక్కడా తనాఖా పెట్టలేదని బొత్స‌ స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ది కోసమే రాజధానిలోని భూములను హడ్కోకు తాకట్టు పెట్టారని.. రాజధాని భూములను చంద్రబాబు హయాంలోనే తనాఖా పెట్టారని ఆయ‌న వెల్ల‌డించారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్రం పార్లమెంటులో చెప్పిందని మంత్రి గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News