Ukraine: పుతిన్‌కు మరో షాక్... ఉక్రెయిన్‌లోని రష్యన్ల ఆస్తుల సీజ్
- పుతిన్ ఇమేజీని దెబ్బ తీసే దిశగా జెలెన్ స్కీ
- ఉక్రెయిన్‌లోని రష్యన్ల ఆస్తుల సీజ్‌కు క్షణాల్లో చట్టం
- ఈ పరిణామం పుతిన్‌కు పెద్ద షాకేనంటూ కథనాలు
ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలెట్టిన రష్యాకు నిజంగానే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగించేలా రష్యా వ్యవహరిస్తోందని ఆరోపించిన పలు దేశాలు రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలను విధించాయి. స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా పుతిన్‌కు మరో షాక్ తగిలింది. ఈ షాక్ ఇతర దేశాల నుంచి కాకుండా తాను దండెత్తి వచ్చిన ఉక్రెయిన్ నుంచే ఎదురైంది. రష్యా యుద్ధోన్మాదం కారణంగా తమ దేశంలోని రష్యన్ల ఆస్తులను సీజ్ చేయాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ఓ సరికొత్త ప్రతిపాదనను తన దేశ పార్లమెంటు ముందు ఉంచారు.
పుతిన్ ఇమేజీని దెబ్బ తీసేదిగా భావిస్తున్న ఈ తరహా చర్యకు జెలెన్ స్కీ చాలా తెలివిగా ప్లాన్ చేసినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. జెలెన్ స్కీ ప్రతిపాదనకు ఉక్రెయిన్ పార్లమెంటు అప్పటికప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని రష్యన్ల ఆస్తుల సీజ్‌కు సంబంధించిన చట్టం అమల్లోకి వచ్చేసింది.