Ukraine: భారతీయులను మానవ కవచాలుగా ఉక్రెయిన్ వాడుతోంది: రష్యా
- భారతీయులు, అరబ్ లను వెళ్లనీయడం లేదన్న రష్యా విదేశాంగ మంత్రి
- భారతీయ విద్యార్థి మరణంపై దర్యాప్తు చేస్తామని వెల్లడి
- భారత విద్యార్థులు ఎవరూ బందీలుగా లేరన్న భారత్ ప్రతినిధి
- భారతీయుల కోసం రైళ్లను ఏర్పాటు చేయమని ఉక్రెయిన్ ను కోరిన భారత్
ఉక్రెయిన్ అధికారులపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన ఆరోపణలు చేశారు. భారతీయులను మానవ రక్షణ కవచాలుగా వినియోగిస్తున్నట్టు లావ్రోవ్ వ్యాఖ్యానించారు. భారతీయులు, అరబ్ లు, ఆఫ్రికన్లను ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోకుండా అక్కడి అధికారులు అడ్డుకుంటూ.. వారిని మానవ రక్షణ కవచాలుగా వినియోగిస్తున్నట్టు ఆరోపించారు.
మాస్కోలో నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా లావ్రోవ్ ఈ ఆరోపణలు చేశారు. ఖర్కీవ్ లో దాడికి గురై భారతీయ విద్యార్థి మరణించిన అంశం భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య బుధవారం నాటి ఫోన్ కాల్ సందర్భంగా చర్చకు వచ్చినట్టు లావ్రోవ్ తెలిపారు. భారతీయ విద్యార్థి మరణంపై దర్యాప్తు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు.
భారతీయ విద్యార్థులు ఖర్కీవ్ లో బందీలుగా ఉన్నారంటూ రష్యా చేసిన ఆరోపణల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘‘ఉక్రెయిన్ లోని మా ఎంబసీ అక్కడి భారతీయ విద్యార్థులతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు ఖర్కీవ్ నుంచి బయటకు వచ్చేశారు. ఖర్కీవ్ లో భారతీయ విద్యార్థుల బందీకి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఖర్కీవ్ వో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని భారతీయులను పశ్చిమ ప్రాంతానికి తరలించేందుకు రైళ్లను ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్ అధికారులను కోరాము’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.