Indian students: ఉక్రెయిన్ వీడిన వైద్య విద్యార్థులు.. కోర్సు పూర్తి చేసుకునేందుకు ఇక్కడే అవకాశం!
- కుదిరితే దేశీ వైద్య కళాశాలల్లో ప్రవేశాలు
- లేదంటే విదేశీ యూనివర్సిటీలకు బదిలీ
- త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం
- నిబంధనల్లో మార్పులు చేయాలన్న సూచనలు
ఉక్రెయిన్ నుంచి భారత్ కు తిరిగి వచ్చిన విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర సర్కారు సమాలోచనలు చేస్తోంది. ముఖ్యంగా వైద్య విద్యా కోర్సు చేస్తున్న మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులు, మిగిలిన కోర్సు కాలాన్ని దేశీయ మెడికల్ కళాశాలల్లో పూర్తి చేసుకునే విధంగా ఉన్న అవకాశాలను పరిశీలించనుంది.
నేషనల్ మెడికల్ కౌన్సిల్, కేంద్ర ఆరోగ్య శాఖ, నీతి ఆయోగ్ త్వరలోనే సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నట్టు సదరు వర్గాలు వెల్లడించాయి. సంబంధిత మంత్రిత్వ శాఖలు దీనిపై చర్చిస్తున్నాయని, సాధ్యమైన పరిష్కారంతో ముందుకు రానున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.