Russia: శవానికి ఎక్కువ చోటు కావాలి.. కర్ణాటక విద్యార్థి నవీన్ మృతదేహం తరలింపుపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
- ఆ స్థలంలో మరో 10 మందిని తీసుకురావొచ్చన్న అరవింద్ బెల్లాడ్
- విద్యార్థులను తీసుకురావడమే గగనమవుతోందని వ్యాఖ్య
- నవీన్ మృతదేహం తరలింపునకు సమయం పడుతుందని వెల్లడి
ఉక్రెయిన్ లో రష్యా దాడిలో భారతీయ విద్యార్థి నవీన్ చనిపోయిన సంగతి తెలిసిందే. కొడుకును పోగొట్టుకుని కర్ణాటకకు చెందిన అతడి తల్లిదండ్రులు బాధపడుతుంటే బీజేపీ ఎమ్మెల్యే మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. మృతదేహాన్ని తరలించాలంటే విమానంలో ఎక్కువ చోటు కావాల్సి ఉంటుందని, ఆ స్థలంలో మరో 8 నుంచి 10 మంది విద్యార్థులను తీసుకొచ్చేందుకు వీలుంటుందని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వ్యాఖ్యానించారు.
‘‘యుద్ధంతో ఊగిసలాడుతున్న ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తరలించడమే గగనమైపోతోంది. అలాంటిది మృతదేహాన్ని తరలించడమూ ఇబ్బందే కదా? విద్యార్థులను తరలించే విమానంలోనే మృతదేహాన్ని తరలించినా.. మృతదేహాన్ని ఉంచే బాక్స్ కే ఎక్కువ చోటు కావాల్సి వస్తుంది. ఆ ప్లేస్ లో 10 మంది విద్యార్థులకు చోటు ఇవ్వొచ్చు. కాబట్టి నవీన్ మృతదేహం తరలింపునకు ఇంకా సమయం పడుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.