Russia: రష్యా ప్రతీకార చర్యలు... ట్విట్టర్, ఫేస్ బుక్ లపై నిషేధం!

Russia reportedly bans US based social media sites
  • ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా
  • పాశ్చాత్యదేశాలు, ఈయూ ఆంక్షలు
  • అదే బాటలో టెక్ సంస్థలు
  • అయినప్పటికీ రష్యా దూకుడు
  • టెక్ సంస్థలపై ఆంక్షలు
ఉక్రెయిన్ లో రష్యా మారణహోమం సృష్టిస్తుండడంతో ఆ దేశంపై తీవ్ర ఆంక్షలు విధించడం తెలిసిందే. దాంతో రష్యా కూడా ప్రతీకార చర్యలకు దిగుతోంది. తాజాగా సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు ఫేస్ బుక్, ట్విట్టర్ లపై రష్యా నిషేధం విధించింది. అంతేకాదు, యాప్ స్టోర్ తో పాటు బ్రిటన్ మీడియా సంస్థ బీబీసీని కూడా నిషేధించింది. 

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి వివిధ టెక్ సంస్థలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యన్ మీడియా సంస్థల వెబ్ సైట్లు, యూట్యూబ్ చానళ్లకు గూగుల్ వాణిజ్య ప్రకటనలు నిలిపివేసింది. దాంతో ఆయా చానళ్లు, మీడియా వెబ్ సైట్ల ప్రధాన ఆదాయ వనరు నిలిచిపోయినట్టయింది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. 

ఈ నేపథ్యంలో, రష్యా కూడా ప్రతిగా ఫేస్ బుక్, ట్విట్టర్ లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ మీడియా సంస్థ ప్రతినిధి వెల్లడించారు. 

కాగా, తనపై ఆర్థిక ఆంక్షలు విధించడంతో, రష్యా కూడా దీటుగా స్పందిస్తూ, అమెరికాకు రాకెట్ ఇంజిన్ల సరఫరా నిలిపివేయడం తెలిసిందే. అంతేకాదు, కౌరూ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి తన సిబ్బందిని, సాంకేతిక నిపుణులను రష్యా ఉపసంహరించుకుంది.
Russia
Facebook
Twitter
Ban
Ukraine
War

More Telugu News