Russia: రష్యాలో సైన్యంపై తప్పుడు ప్రచారం చేస్తే 15 ఏళ్ల జైలు శిక్ష
- సైన్యంపై తప్పుడు ప్రచారానికి జైలు శిక్షతో పాటు జరిమానా
- కొత్త చట్టానికి రష్యా రూపకల్పన
- రష్యా పార్లమెంటులోని దిగువ సభ చట్టానికి ఆమోదం
రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం ఫలితంగా ఆ దేశాల్లో కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. రష్యా దాడులకు ప్రతీకార చర్యగా తమ దేశంలో ఉంటున్న రష్యన్ల ఆస్తులను సీజ్ చేసేందుకు గురువారం నాడు ఉక్రెయిన్ ఓ కీలక చట్టం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా రష్యాలో కూడా ఆ దేశ పార్లమెంటు ఓ కొత్త చట్టానికి ఆమోద ముద్ర వేసింది. సైన్యంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలకు ఉద్దేశించిన ఆ చట్టానికి శుక్రవారం నాడు రష్యా పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది.
ఈ చట్టం ప్రకారం రష్యా సాయుధ దళాలపై తప్పుడు ప్రచారం వ్యాప్తి చేయడాన్ని జైలు శిక్ష విధించదగిన నేరంగా పరిగణిస్తారు. రష్యా సైన్యంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసిన వారికి 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఈ మేరకు రష్యా పార్లమెంటులోని దిగువ సభ ఈ చట్టానికి ఆమోద ముద్ర వేసింది.