Telangana: తెలంగాణ వాటా నిధులు ఇవ్వండి.. కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ
- ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద తెలంగాణకు రెండు ప్రాజెక్టులు
- వాటికి రూ.120 కోట్లను కేటాయించిన కేంద్రం
- తన వాటా నిధులను ఇప్పటికే విడుదల చేసిన కేంద్రం
- రాష్ట్ర వాటా నిధులు విడుదల కాని వైనం
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే..దానికి ప్రతిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరుసబెట్టి పలు అంశాలను లేవనెత్తుతున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుక్రవారం నాడు కిషన్ రెడ్డి మరో లేఖ రాశారు. ఈ లేఖలో కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన వాటా నిధులు విడుదల చేయగా... రాష్ట్ర వాటా నిధులు ఇప్పటిదాకా విడుదల కాలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఆ పథకానికి సంబంధించిన రాష్ట్ర వాటా నిధులను తక్షణమే విడుదల చేయాలని కూడా కిషన్ రెడ్డి కోరారు.
ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పథకం కింద తెలంగాణకు సంబంధించి వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంపికయ్యాయి. వీటికి రూ.120 కోట్లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన వాటా నిధులను విడుదల చేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర వాటా నిధులు మాత్రం ఇప్పటిదాకా విడుదల కాలేదట. దీంతో తన లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించిన కిషన్ రెడ్డి..తక్షణమే రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయాలని కేసీఆర్‌ను కోరారు.