Anand Mahindra: ప్రభాస్ సినిమా కోసం సాయం కోరిన నాగ్ అశ్విన్... ఎలా కాదంటామన్న ఆనంద్ మహీంద్రా!

Anand Mahindra accepts Nag Ashwin request for Prabhas new movie Project K
  • ప్రభాస్ హీరోగా 'ప్రాజెక్ట్ కె'
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చిత్రం
  • ఇంజినీర్ల తోడ్పాటు కావాలన్న నాగ్ అశ్విన్
  • ఆనంద్ మహీంద్రాకు రిక్వెస్ట్
  • సంతోషంగా ఒప్పుకున్న ఆనంద్ మహీంద్రా
మహానటి చిత్రంతో తానేంటో నిరూపించుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్... ప్రభాస్ తో 'ప్రాజెక్ట్ కె' పేరిట భారీ చిత్రం చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిస్తుండగా, సాంకేతికతను ఓ రేంజిలో వాడుతున్నారు. అందుకోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సాయం కోరారు. 

'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నామని, ఇందుకు ఎంతో టెక్నాలజీ పరమైన సేవలు అవసరమవుతాయని పేర్కొన్నారు. భవిష్యత్ లో వాహనాలు ఎలా ఉంటాయో ఇందులో చూపించబోతున్నామని, అందుకోసం మహీంద్రా సంస్థకు చెందిన ఇంజినీర్లు తమ చిత్రానికి సహకరించేలా చూడాలని ట్వీట్ చేశారు. 

దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. "భవిష్యత్ దార్శనికతను ప్రతిబింబించేలా చిత్రాన్ని తీస్తున్న మీకు సాయపడే అవకాశాన్ని ఎలా కాదనుకుంటాం నాగ్ అశ్విన్?" అని బదులిచ్చారు. "మా సంస్థ గ్లోబల్ ప్రొడక్ట్ చీఫ్ వేలు మీకు అన్ని విధాలుగా, సంతోషంగా సహకరిస్తారు" అని నాగ్ అశ్విన్ కు మాటిచ్చారు. "మా ఎక్స్ యూవీ 700 వాహనాన్ని అభివృద్ధి చేసింది వేలునే ... ఇప్పుడు మీ ప్రాజెక్టుకు కూడా తోడ్పాటు అందిస్తారు" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' మూవీలో బాలీవుడ్ అందాలభామ దీపికా పదుకొణే హీరోయిన్. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.
Anand Mahindra
Nag Ashwin
Project K
Prabhas
Tollywood

More Telugu News