IAEA: ఉక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితిపై ప్రకటన చేసిన ఐఏఈఏ
- ఉక్రెయిన్ లోని జపోర్జియాలో భారీ అణు విద్యుత్ కేంద్రం
- 6 భారీ రియాక్టర్లతో కూడిన ప్లాంట్
- రష్యా దాడి చేసిందన్న ఉక్రెయిన్
- రేడియేషన్ ఆనవాళ్లేవీ లేవన్న ఐఏఈఏ
ఉక్రెయిన్ లోని జపోర్జియా అణు విద్యుత్ ప్లాంట్ యూరప్ లోనే అతిపెద్దది. ఈ అణు విద్యుత్ ప్లాంట్ పై రష్యా దాడికి దిగడంతో యూరప్ లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ప్లాంట్ ధ్వంసం అయితే వెలువడే రేడియేషన్ యూరప్ ను అతలాకుతలం చేస్తుందన్న నిపుణుల హెచ్చరికలే అందుకు కారణం. కాగా, జపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ ను రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న సంగతిని ఉక్రెయిన్ ప్రభుత్వం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ)కి తెలియజేసింది.
ఈ నేపథ్యంలో, అణు విద్యుత్ కేంద్రం ప్రస్తుత పరిస్థితిపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియో గ్రాస్సీ ఓ ప్రకటన చేశారు. ఈ న్యూక్లియర్ ప్లాంట్ ఇక్కడి సాధారణ సిబ్బందితోనే యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తోందని వెల్లడించారు. రేడియాధార్మిక పదార్థాల విడుదలకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. జపోర్జియా అణు విద్యుత్ కేంద్రంలో 6 అత్యంత శక్తిమంతమైన రియాక్టర్లు ఉన్నాయి.
రష్యా దండయాత్ర నేపథ్యంలో, ఓ మిస్సైల్ గతరాత్రి అణు విద్యుత్ ప్లాంట్ లోని ఓ శిక్షణ కేంద్రాన్ని తాకిందని, దాంతో అగ్నిప్రమాదం సంభవించగా ఆర్పివేశారని ఐఏఈఏకి సమాచారం అందింది. కాగా, ఈ ప్లాంట్ లోని భద్రతా వ్యవస్థలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, రేడియేషన్ గుర్తించే వ్యవస్థలు సజావుగానే పనిచేస్తున్నట్టు గుర్తించారు.