Ravindra Jadeja: జడేజా భారీ సెంచరీ... 574/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా
- మొహాలీలో టీమిండియా వర్సెస్ శ్రీలంక
- టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్
- జడేజా 175 నాటౌట్
- ముగ్గురితో 100 పైచిలుకు భాగస్వామ్యాలు
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మొహాలీలో శ్రీలంక జట్టుపై భారీ సెంచరీ నమోదు చేశాడు. లోయరార్డర్ లో వచ్చిన జడేజా 228 బంతులు ఎదుర్కొని 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. జడేజా స్కోరులో 17 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను 574-8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ప్రస్తుతం టీ విరామం ప్రకటించారు.
కాగా, జడేజాకు ఇవాళ్టి ఆటలో మరో ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నుంచి సహకారం లభించింది. అశ్విన్ 82 బంతుల్లో 8 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. అశ్విన్ అవుటైన తర్వాత వచ్చిన జయంత్ యాదవ్ (2) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా, షమీ (20 నాటౌట్) అండతో జడేజా స్కోరును 500 మార్కు దాటించాడు. ఈ క్రమంలో ముగ్గురు ఆటగాళ్లతో కలిసి జడేజా 100 పైచిలుకు భాగస్వామ్యాలు నమోదు చేశాడు.
ఏడోస్థానంలో, అంతకు దిగువన వచ్చి మూడు శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన తొలి ఆటగాడయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో జడేజా... పంత్ తో 104 పరుగులు, అశ్విన్ తో 130 పరుగులు, షమీతో 103 పరుగులు జోడించడం విశేషం.
ఆటకు ఇవాళ రెండో రోజు కాగా, తొలి రోజు ఆటలో రిషబ్ పంత్ (96) సెంచరీ చేజార్చుకోవడం తెలిసిందే. లంక బౌలర్లలో లక్మల్ 2, విశ్వ ఫెర్నాండో 2, ఎంబుల్దెనియ 2 వికెట్లు తీశారు. లహిరు కుమార, ధనంజయ డిసిల్వ చెరో వికెట్ పడగొట్టారు.