- హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలు దుష్ప్రచారం చేస్తున్నారు
- కోర్టు తీర్పును చదువుకోలేని స్థితిలో ఉన్నారా?
- ఇప్పటికైనా అమరావతిని అభివృద్ధి చేయాలన్న జేఏసీ
రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. రాజధాని విషయంలో చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది. అమరావతే రాజధాని అని హైకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి నేతలు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈరోజు తిరుపతిలో మీడియాతో జేఏసీ నేతలు మాట్లాడుతూ, హైకోర్టు తీర్పుతోనైనా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని కోరారు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలు దుష్ప్రచారం చేయడం దారుణమని అన్నారు. కోర్టు తీర్పును చదువుకోని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారా? అని ప్రశ్నించారు.
హైకోర్టు తీర్పుతో అమరావతిని సాధించామని... ఇది రాష్ట్ర ప్రజలందరి విజయమని చెప్పారు. అమరావతి రాజధాని కోసం సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నామని అన్నారు. మరోవైపు హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.