KTR: నేను గత 16 ఏళ్ల నుంచి మధుమేహంతో బాధపడుతున్నా: మంత్రి కేటీఆర్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన
- తనకు షుగర్ వ్యాధి ఉందని మీడియాకు తెలిపిన కేటీఆర్
- అందుకే జాగ్రత్తగా ఉంటానని వెల్లడి
- ఆరోగ్య తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ గురించి వివరణ
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తన వ్యక్తిగత ఆరోగ్య అంశాన్ని మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. తాను గత 16 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నట్టు వెల్లడించారు. అప్పట్లో షుగర్ పరీక్షలు చేయించుకుంటే మధుమేహం ఉందని తెలిసిందని వివరించారు. అందుకే ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని, శరీర స్థితి పట్ల అప్రమత్తంగా ఉంటానని స్పష్టం చేశారు.
ఆరోగ్య తెలంగాణ కార్యాచరణ గురించి మాట్లాడుతూ కేటీఆర్ తనకు షుగర్ ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. కాగా, ఆరోగ్య తెలంగాణ గురించి చెబుతూ, రాష్ట్ర ప్రజలకు సంబంధించి బీపీ, షుగర్, కిడ్నీ, గుండె తదితర సమాచారంతో పాటు వ్యక్తులు ఎత్తు, బరువు వంటి అంశాలను కూడా ఆరోగ్య బృందాలు సేకరిస్తాయని వెల్లడించారు.
220 బృందాలు ఇంటింటికీ వచ్చి ఈ మేరకు పరీక్షలు చేసి ఆ వివరాలను ఆన్ లైన్ లో పొందుపరుస్తారని కేటీఆర్ తెలిపారు. అంతేకాదు, ఈ బృందాలు ఇంటివద్దే కంటి పరీక్షలు, రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తాయన్నారు. ఒక్కసారి ఈ విధమైన హెల్త్ ప్రొఫైల్ రూపొందించుకుంటే, ఆపై ఏ ఆసుపత్రికి వెళ్లినా స్పష్టమైన డేటా అందుబాటులో ఉండడం వల్ల మెరుగైన సేవలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.