Panneerselvam: అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వం సోదరుడి బహిష్కరణ!
- శశికళను కలిసినందుకు బహిష్కరణ వేటు
- పన్నీర్ సెల్వం, పళనిస్వామి పేరిట ప్రకటన
- తనను బహిష్కరించేందుకు వారెవరన్న పన్నీర్ సోదరుడు రాజా
అన్నాడీఎంకే అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోదరుడు ఓ.రాజాను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయనతో పాటు మరో ముగ్గురిపై కూడా వేటు వేశారు. ఈ మేరకు అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్ సెల్వం, కోఆర్డినేటర్ పళనిస్వామి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.
అంతేకాదు బహిష్కరణకు గురైన నేతలతో పార్టీకి సంబంధించిన అంశాలను చర్చించరాదని ప్రకటనలో కార్యకర్తలను ఆదేశించారు. రాజాతో పాటు బహిష్కరణకు గురైన వారిలో తేని జిల్లా సాహిత్య విభాగం కార్యదర్శి మురుగేశన్, తేని జిల్లా మత్స్యకారుల విభాగం కార్యదర్శి కరుప్పుజీ, గూడలూరులోని జయలలిత పేరవై కార్యదర్శి సేతుపతి ఉన్నారు. శశికళను కలవడంతో వీరిని పార్టీ నుంచి బహిష్కరించారు.
పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన అనంతరం రాజా మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకేకి శశికళ నాయకత్వం అవసరమని చెప్పారు. పార్టీ నుంచి తనను బహిష్కరించేందుకు వారెవరని ప్రశ్నించారు. ఎంజీ రామచంద్రన్ ఉన్నప్పటి నుంచి తాను పార్టీలో సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. తన బహిష్కరణ చెల్లదని అన్నారు. పార్టీ పగ్గాలను చేపట్టాలని శశికళను తాము కోరామని తెలిపారు.