Telangana: డిసెంబర్‌లో అసెంబ్లీ రద్దు.. మార్చిలో ఎన్నికలు: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
- తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై రేవంత్ జోస్యం
- సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు
- కేసీఆర్‌కు ఫ్రంటే కాదు టెంటు కూడా లేదని వ్యాఖ్య
2018లో జరిగినట్టుగానే ఈ దఫా కూడా ముందస్తు ఎన్నికలకే సీఎం కేసీఆర్ సిద్ధపడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌లో అసెంబ్లీని రద్దు చేయనున్న కేసీఆర్.. వచ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా వ్యూహాలు రచిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ కథ తేలుస్తానని.. మోదీని గద్దె దించేవరకు నిద్రపోనని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం నాడు రాంచీలో ఝార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరేన్‌ను కలిసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి ఫ్రంట్ పెట్టడం లేదని కేసీఆర్ చెప్పారని రేవంత్ విమర్శించారు. కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని.. రాష్ట్రంలో పేదల కష్టాలు తీర్చాల్సిన ఆయన దేశమంతటా దేశ దిమ్మరిలా తిరుగుతున్నాడని.. చెట్టు మీద కోతిలాగా, కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారని రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
12 నెలలు కష్టపడితే అధికారం కాంగ్రెస్ పార్టీదే అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ప్రస్తుతం టెంటు లేదు, ఫ్రంట్ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిరోజే ప్రగతి భవన్‌ను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మారుస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.