UK: యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు
- రష్యా డిమాండ్లు నెరవేరే దాకా యుద్ధం ఆగదు
- యుద్ధాన్ని మరింత భీకరంగా మారుస్తాం
- ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలు లేకుండా చేస్తాం
- నాటో దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదన్న పుతిన్
ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో విరుచుకుపడుతున్న రష్యా ఇప్పుడప్పుడే యుద్ధాన్ని ముగించేలా కనిపించడం లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం రాకపోగా.. యుద్ధాన్ని మరింత భీకరంగా మారుస్తామంటూ తాజాగా శనివారం నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తమ డిమాండ్లకు తలొగ్గేదాకా యుద్ధాన్ని ఆపేదే లేదని కూడా ఆయన ప్రపంచ దేశాలను మరింతగా భయపెట్టారు. ఈ మేరకు కాసేపటి క్రితం పుతిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.
ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పైనే కాకుండా ఇతర దేశాలను కూడా హెచ్చరిస్తూ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానం. నాటో దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఊహించినదాని కంటే ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం జరుగుతుంది. మా డిమాండ్లు నెరవేరే దాకా యుద్ధం ఆగదు. ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలు లేకుండా చేస్తాం. శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించింది. అందుకు ఆ దేశం మూల్యం చెల్లించుకోవాల్సిందే' అని పుతిన్ వ్యాఖ్యానించారు.