nse: చిత్రా రామకృష్ణకు ముందస్తు బెయిల్ లేదు.. సీబీఐ కోర్టు ఏమందంటే..!
- ఎన్ఎస్ఈలో కో లొకేషన్ ఆరోపణలు
- ఓ యోగితో కలిసి చిత్ర కుట్రలు
- ఇది తీవ్ర ఆర్థిక నేరమేనన్న సీబీఐ కోర్టు
స్టాక్ మార్కెట్లో కో లొకేషన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేషనల్ స్టాక్ ఎక్సేంజి (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణకు ముందస్తు బెయిల్ దక్కలేదు. ఈ మేరకు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చిత్ర దాఖలు చేసుకున్న పిటిషన్ను శనివారం విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టేసింది. చిత్రకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.
ఓ యోగితో వ్యాపార విషయాలు పంచుకుని స్టాక్ మార్కెట్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో చిత్రపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితమే ఈ కేసు నమోదైనా సీబీఐ దానిని అసలు పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్న తీరుపై కూడా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేకూర్చే లోతైన కుట్రలకు సంబంధించిన కేసు కాబట్టి.. నిందితురాలికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని కోర్టు చెప్పింది. అంతేకాకుండా ప్రజా ధనానికి కూడా భారీ నష్టం వాటిల్లినట్లు నిందితురాలిపై ఆరోపణలు ఉన్నాయని, ఈ కారణంగా ఈ కేసును తీవ్ర ఆర్థిక నేరంగా పరిగణించాల్సి ఉంటుందని కూడా కోర్టు అభిప్రాయపడింది.