Devineni Uma: 2 లక్షల కోట్ల రూపాయలు ఏమైపోతున్నాయి?: దేవినేని ఉమ
- ఆర్బీఐకి రెగ్యులర్ కస్టమర్ గా మారిన ఏపీ సర్కార్
- మంగళవారం రాగానే అప్పుకోసం పడిగాపులు
- ఈ ఏడాదే ఆర్బీఐ వద్ద 46 వేల కోట్ల అప్పు
- అప్పు, ఆదాయం కలిపి ఏటా వస్తున్న డబ్బులు ఏమవుతున్నాయన్న దేవినేని
'వారం వారం ఇదేం ఘోరం' పేరిట ప్రముఖ దినపత్రిక 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన ఓ కథనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఆర్బీఐ నుంచి అప్పులు తెచ్చుకోవడంలో ఏపీ సర్కారు రికార్డు సృష్టిస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారు.
వచ్చే మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో రూ.2,000 కోట్ల అప్పు తీసుకుంటామని వైసీపీ ప్రభుత్వం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అనుమతితో ఆర్బీఐ ద్వారా తెచ్చిన అప్పు రూ.46,000 కోట్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఆయా అంశాలను దేవినేని ఉమ ప్రస్తావించారు.
''ఆర్బీఐకి రెగ్యులర్ కస్టమర్ గా మారిన సర్కార్, మంగళవారం రాగానే అప్పుకోసం పడిగాపులు, ఈ ఏడాదే ఆర్బీఐ వద్ద 46 వేలకోట్ల అప్పు. రుణ సేకరణలో వైసీపీ సర్కార్ రికార్డ్. అభివృద్ధి లేదు, కొత్త ప్రాజెక్టులు లేవు.. అప్పు, ఆదాయం కలిపి ఏటా వస్తున్న 2 లక్షల కోట్ల రూపాయలు ఏమైపోతున్నాయి?'' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.