Russia: ‘కావాలంటే బ్రిటిష్ వాళ్లను అడగండి’ అంటూ రష్యా సైన్యానికి ఆనంద్ మహీంద్ర చురకలు
- ఇటీవల ఖేర్సన్ ను ఆక్రమించుకున్న రష్యా
- ఆ దేశ సైనికులకు వ్యతిరేకంగా ప్రజల ర్యాలీ
- ఆ వీడియోను పోస్ట్ చేసి కామెంట్ పెట్టిన ఆనంద్ మహీంద్ర
- సత్యాగ్రహానికి మించిన ఆయుధం లేదని వ్యాఖ్య
ఉక్రెయిన్ పై రష్యా పట్టు వీడడం లేదు. దాడులతో విరుచుకుపడుతూ నగరాలను వశపరచుకుంటోంది. ఈ క్రమంలోనే ఖేర్సన్ పట్టణాన్ని తమ అధీనంలోకి తీసేసుకుంది. తద్వారా రష్యా చేతుల్లోకి వెళ్లిపోయిన తొలి ఉక్రెయిన్ నగరంగా అది మిగిలిపోయింది. ఆ నగర మేయర్ కూడా రష్యా సేనలకు లొంగిపోయారు. రష్యా సైనికులు చెప్పింది వినాలంటూ ప్రజలకు సూచించారు.
ప్రజలు మాత్రం రష్యా సైన్యంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల రష్యా సైన్యానికి ఎదురెళ్లిన ఖేర్సన్ పౌరులు.. భారీ ర్యాలీ తీశారు. వాళ్లను తరిమికొట్టేందుకు రష్యా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు.
అయితే, రష్యా సైన్యంపై ఆనంద్ మహీంద్ర మండిపడ్డారు. ఖేర్సన్ పౌరుల ర్యాలీ వీడియోను పోస్ట్ చేశారు. నిరాయుధ ప్రజలను సాయుధ దళాలు ఎదుర్కోవాలనుకుంటే.. వాళ్లు ఎదుర్కోబోతోంది యుద్ధ ట్యాంకుల కన్నా అత్యంత శక్తిమంతమైన ఆయుధమని గుర్తుంచుకోవాలని ట్వీట్ చేశారు. సత్యాగ్రహం చాలా శక్తిమంతమైనదని, దానికి సరిపోయే ఆయుధం లేదని పేర్కొన్నారు. కావాలంటే బ్రిటిష్ వాళ్లను అడగాలంటూ ఆయన కామెంట్ చేశారు.