Russia: మాకు సోవియట్ కాలం నాటి యుద్ధ విమానాలిప్పించండి.. నన్ను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావొచ్చు: జెలెన్ స్కీ

Zelensky Wants More Fighter Jets That Of Soviet Era

  • అమెరికా సెనేట్ లో జూమ్ కాల్ ద్వారా ప్రసంగం
  • మరిన్ని యుద్ధ విమానాలు ఇప్పించాలని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
  • తమ సైనికులు ఆధునిక యుద్ధ విమానాలు నడపలేరని వ్యాఖ్య

రష్యాను ఎదుర్కొనేందుకు తమకు మరిన్ని యుద్ధ విమానాలను పంపాలని, సోవియట్ కాలం నాటి యుద్ధ విమానాలను అందించేలా చూడాలని అమెరికా చట్టసభ సభ్యులను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ కోరారు. ఇవాళ ఆయన 280 మంది ఉన్న అమెరికా చట్టసభలో జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. యుద్ధంలో తమకు అదనపు సాయం చేయాలన్నారు. 

తమకు మానవతా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాలన్నీ రష్యా చమురు కొనకుండా చూడాలన్నారు. రష్యాకు వ్యతిరేకంగా ‘నో ఫ్లై జోన్’ విధించాలని మరోసారి నాటోతో పాటు సభ్య దేశాలను ఆయన కోరారు. తనను సజీవంగా చూడడం, తాను మాట్లాడడం ఇదే చివరిసారి కావొచ్చంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను కీవ్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం తమ సైనికులు సోవియట్ కాలం నాటి మిగ్ 29 యుద్ధ విమానాలనే వాడుతున్నారని, నాటోలో చేరిన పోలెండ్ వంటి దేశాలు యుద్ధ విమానాలను అప్ గ్రేడ్ చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు. తమ సైనికులకు ఆధునిక యుద్ధ విమానాలు నడపడంలో సరైన శిక్షణ లేదని, కాబట్టి పోలెండ్ వంటి దేశాల నుంచి సోవియట్ కాలం నాటి యుద్ధ విమానాలను ఇప్పించాలని జెలెన్ స్కీ కోరారు. దాని వల్ల శిక్షణ తీసుకునే అవసరం కూడా తగ్గుతుందన్నారు.  

అనంతరం ఉక్రెయిన్ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం కోసం ఉక్రెయిన్ పౌరులు పోరాడుతూనే ఉంటారని, రష్యా దళాలను ఎదుర్కోవాలని, పోరాటం ఆపవద్దని జెలెన్ స్కీ ప్రజలకు సూచించారు. ఉక్రెయిన్ లోని ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ దళాల ప్రతిఘటన రష్యా దళాలకు అవమానకరమని పేర్కొన్నారు. 

కాగా, జెలెన్ స్కీ భద్రత దృష్ట్యా ఆ ప్రసంగ వీడియోలను రహస్యంగా ఉంచాల్సిందిగా సెనేటర్లను అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి కోరినా.. ఇద్దరు సెనేటర్లు ఆయన జూమ్ కాల్ స్క్రీన్ షాట్లను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో తోటి సెనేటర్లు వారిపై మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News