Indians: అర్జంటుగా మీ ఫోన్ నెంబర్, లొకేషన్ తెలియజేయండి: ఉక్రెయిన్ లోని భారత పౌరులను కోరిన ఎంబసీ అధికారులు
- ఉక్రెయిన్ లో విషమిస్తున్న పరిస్థితులు
- దేశాన్ని వీడుతున్న ఉక్రెయిన్ ప్రజలు
- ఇంకా ఉక్రెయిన్ లోనే వందలాది భారత విద్యార్థులు
- ఆన్ లైన్ లో గూగుల్ ఫారంను పొందుపరిచిన భారత ఎంబసీ
ఉక్రెయిన్ లో పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయి. రష్యా దాడులు మరింత ఉద్ధృతం చేసిన నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు సైతం లక్షలాదిగా దేశం విడిచిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీయులకు ఉక్రెయిన్ లో భ్రదత ఎంతో కష్టసాధ్యమైన విషయం. భారత్ కూడా ఉక్రెయిన్ నుంచి విద్యార్థులు, వివిధ రంగాల నిపుణులను స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటికీ ఖర్కీవ్, మేరియుపోల్ వంటి నగరాల్లో భారత విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నట్టు ఉక్రెయిన్ లో భారత ఎంబసీ అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ లో ఉంటున్న భారత పౌరులు అర్జంటుగా తమ ఫోన్ నెంబర్లు, లొకేషన్లను తెలియజేస్తూ తమను సంప్రదించాలని ఎంబసీ అధికారులు కోరారు. అందుకోసం ఆన్ లైన్ లో ఓ గూగుల్ ఫారంను పొందుపరిచారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత పౌరులు ఆ ఫారంను తమ వివరాలతో నింపాలని పేర్కొన్నారు. ప్రాథమిక వివరాలతో పాటు, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారన్నది స్పష్టంగా తెలియజేయాలని వివరించారు.