Biswabhusan Harichandan: తొలిసారి అసెంబ్లీలో ప్రత్యక్షంగా ప్రసంగించనున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్... ట్రయల్ రన్ నిర్వహణ

AP Governor Biswabhushan Harichandan first time to attend in person to AP Assembly sessions

  • రేపటి నుంచి శాసన సభ బడ్జెట్ సమావేశాలు
  • గతంలో ఆన్ లైన్ లో ప్రసంగించిన గవర్నర్
  • ఈసారి ప్రత్యక్షంగా ప్రసంగించనున్న వైనం 

రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపధ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సభలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శాసనసభకు హాజరు కానున్నారు. కరోనా నేపథ్యంలో గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ఆన్ లైన్ విధానంలో ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించగా ఈ విడత ఆయన నేరుగా సభకు వచ్చి సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా నేతృత్వంలో రాజ్ భవన్ అధికారులు పూర్తి స్ధాయి ట్రయల్ రన్ ను నిర్వహించారు. విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ శాసనసభకు చేరుకునే మార్గం, శాసనసభలో ఏ గేటు నుండి కాన్వాయ్ లోపలికి ప్రవేశిస్తుంది, గౌరవ గవర్నర్ కు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి, శాసస సభ స్పీకర్, శాసన పరిషత్తు ఛైర్మన్ తదితరులు ఎక్కడ స్వాగతం పలుకుతారు, గౌరవ వందనం స్వీకరించే ప్రదేశం ఇలా అన్ని విషయాలను శాసనసభ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులు నుండి సిసోడియా అడిగి తెలుసుకున్నారు.

సభ్యులు అందరికీ గవర్నర్ స్పష్టంగా కనిపించేలా సభలో పోడియం ఎంత ఎత్తులో ఉండాలి, దీనికి అవసరమైన ఏర్పాట్లు, గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో రాజ్ భవన్ అధికారులు వేచి ఉండే ప్రదేశం, ప్రసంగం తరువాత తిరిగి రాజ్ భవన్ చేరుకోవటం ఇలా ప్రతి విషయాన్ని శాసనసభ కార్యదర్శి రాజ్ భవన్ అధికారులకు వివరించారు.

సూక్ష్మ స్దాయిలో ప్రతి అంశంపైనా రాజ్ భవన్, శాసనసభ అధికారులు చర్చించి ఒక అవగాహానకు వచ్చారు. సమాచార లోపం లేకుండా సమన్వయంతో వ్యవహరించి, కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ సందర్భంగా గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసొడియా అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News