Russia: ఉక్రెయిన్ లో బస్సు చార్జీల బాదుడు.. భారతీయ విద్యార్థులను భయపెట్టి, బెదిరించి వసూలు చేస్తున్న ప్రైవేటు ఆపరేటర్లు
- ఇవే చివరి బస్సులంటూ విద్యార్థులను భయపెడుతున్న వైనం
- పిశోచిన్ నుంచి బయటపడేందుకు విద్యార్థుల పాట్లు
- ఒక్కొక్కరి నుంచి 200 నుంచి 500 డాలర్లు వసూలు
- అంతా వెళ్లిపోయాక బస్సులు పెట్టిన ఎంబసీ అధికారులు
యుద్ధంతో ఇప్పటికే భయం భయంగా బతుకుతున్న భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ ప్రైవేట్ బస్సు వ్యాపారులు మరింత భయపెట్టేస్తున్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం తరలిస్తుండడంతో.. ఆ సరిహద్దు దేశాలకు వెళ్లాలన్న విద్యార్థులకు చేతి చమురు వదిలించేస్తున్నారు. బెదిరించి బస్సుల్లో ఎక్కించి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు.
మళ్లీ చెప్పేవరకు ఎవరూ బయటకు రావొద్దంటూ పిశోచిన్ లోని విద్యార్థులకు భారత రాయబార కార్యాలయం సూచించింది. అయితే, విద్యార్థులు మాత్రం ఎలాగోలా సిటీని విడిచి సరిహద్దులకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అదనుగా తీసుకున్న కొందరు బస్సు ఓనర్లు ఒక్కో విద్యార్థి నుంచి 500 డాలర్ల దాకా వసూలు చేస్తున్నారు.
‘‘ఇవే చివరి బస్సులు.. ఇవిపోతే మళ్లీ రావంటూ చాలా మంది మమ్మల్ని భయపెడుతున్నారు. దీంతో వేరే దారి లేక బస్సులు ఎక్కి పిశోచిన్ నుంచి బయటపడుతున్నాం’’ అని ఓ విద్యార్థి చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ఖార్కివ్ లో ఉన్న విద్యార్థులు ఎట్టిపరిస్థితుల్లోనూ పిశోచిన్, బబాయ్, బెజ్లీడోవ్కాకు రావాలని ఎంబసీ గతంలో సూచించింది.
దాదాపు వెయ్యి మంది దాకా విద్యార్థులు ఖార్కివ్ నుంచి పిశోచిన్ కు కాలినడకన వచ్చారు. ఆ తర్వాత భారతీయులు సహా కొందరు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు బస్సులను నడిపి విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని విద్యార్థులు ఆరోపించారు. లెవివ్ కు వెళ్లేందుకు బేరమాడిన తర్వాత 200 డాలర్లకు బస్సు ఎక్కనిచ్చారని పేర్కొన్నారు. భయపెట్టి తమను బస్సులెక్కించారని తెలిపారు.
ఎంబసీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, దీంతో బస్సు ఆపరేటర్లు తామే అధికారులం అన్న చందాన వ్యవహరిస్తూ విద్యార్థులను భయపెట్టి తరలిస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల ఒత్తిడితో నిన్నటి నుంచి మాత్రమే ఎంబసీ అధికారులు బస్సు సర్వీసులను ఏర్పాటు చేసి విద్యార్థులను తరలిస్తున్నారని చెప్పారు. అప్పటికే చాలా మంది విద్యార్థులు వెళ్లిపోయారని, కేవలం 298 మంది మాత్రమే మిగిలారని విద్యార్థులు మండిపడ్డారు.