Narendra Modi: కొవిడ్ ను బాగానే మేనేజ్ చేశాం అనుకుంటే ఉక్రెయిన్ సంక్షోభం వచ్చిపడిందిl ప్రధాని మోదీ
- పూణేలో ప్రధాని పర్యటన
- మెట్రో రైలుకు ప్రారంభోత్సవం
- ఉక్రెయిన్ పరిస్థితులపై స్పందన
- అగ్రరాజ్యాల కంటే మిన్నగా తరలింపు చేపట్టామని వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పూణేలో మెట్రో రైలు వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను సమర్థవంతంగా స్వదేశానికి తరలిస్తుండడం అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి పెరిగిందన్న దానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన ఆపరేషన్ గంగ (విద్యార్థుల తరలింపు కార్యక్రమం)ను కరోనా వైరస్ నియంత్రణతో పోల్చారు.
కొవిడ్ ను విజయవంతంగా మేనేజ్ చేయగలిగామని, కానీ ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభం వచ్చిపడిందని అన్నారు. అయితే, అగ్రరాజ్యాలు సైతం వారి పౌరులను ఉక్రెయిన్ నుంచి తరలించేందుకు ఇబ్బందులు పడుతున్న వేళ, భారత్ మాత్రం సురక్షితంగా తరలిస్తోందని చెప్పుకొచ్చారు. కల్లోలభరిత ఉక్రెయిన్ నుంచి వేలమంది విద్యార్థులను మాతృభూమికి తీసుకురావడం భారత శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
కాగా, ఉక్రెయిన్ పై రష్యా తీవ్రస్థాయిలో సైనిక చర్య కొనసాగిస్తున్న నేపథ్యంలో, భారత్ ఇప్పటిదాకా ఉక్రెయిన్ నుంచి 13,700 మందిని స్వదేశానికి తరలించింది. ఆపరేషన్ గంగ పేరిట ఉక్రెయిన్ పొరుగు దేశాలకు విమానాలను పంపి, అప్పటికే ఉక్రెయిన్ సరిహద్దులు దాటి పొరుగుదేశాలకు చేరుకున్న విద్యార్థులను ఆ విమానాల్లో భారత్ తీసుకువస్తోంది. ఇంకా, చాలామంది భారతీయులు ఉక్రెయిన్ లోనే ఉన్న నేపథ్యంలో, ఆపరేషన్ గంగలో మరిన్ని విమానాలు చేర్చాలని కేంద్రం భావిస్తోంది.